J.SURENDER KUMAR,
అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం జరిగిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గిరిజన శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, మంత్రివర్గ సహచరులతో కలిసి బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించి, జాతరకు వచ్చే లక్షలాది భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

👉 జాతరకు సంబంధించి పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల వినియోగాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఏఐ (AI) సాంకేతిక పరిజ్ఞానంతో వాటి పనితీరును పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.

👉 దాదాపు వెయ్యేళ్ల వీరగాథ, జాతి వారసత్వ సంపదకు సంబంధించిన చరిత్రకు అద్దం పట్టేలా రాతి ప్రాకారాలు, శిలాతోరణాలతో రాష్ట్ర ప్రభుత్వం మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు.

👉 మూలవాసులైన కోయ తెగల ఆచార వ్యవహారాలను కట్టుదిట్టంగా ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ప్రాంగణాన్ని ఆసాంతం పరిశీలించారు. దాదాపు ₹250 కోట్ల రూపాయల వ్యయంతో గత కొంతకాలంగా శరవేగంగా సాగిన పనులను ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా పరిశీలించారు.
