👉 మీడియా సమావేశంలో మంత్రులు వెల్లడి !
J.SURENDER KUMAR,
పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని 2,996 వార్డులు, డివిజన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.
సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ధనసరి అనసూయ (సీతక్క) మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
👉 చరిత్రలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మేడారంలో జరిగిన ఈ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

👉 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించడం, రిజర్వేషన్లు కూడా ఖరారవడం, అలాగే ఫిబ్రవరి చివరి వారం నుంచి వివిధ స్థాయిల్లో విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు పూర్తి చేయాలని మంత్రిమండలి భావించింది.
👉 మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు ఉండే విధంగా రామప్ప, లక్నవరం నుంచి గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు సంబంధించి ₹143 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మేడారం పుణ్యక్షేత్రం కోసం ఇప్పటికే 19 ఎకరాల భూ సేకరణ పూర్తి కాగా, మరో 20 లేదా 21 ఎకరాల భూమిని సేకరించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని మంత్రిమండలి తీర్మానించింది.
👉 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను సమగ్ర ప్రణాళికతో నిర్వహించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని పురాతన ప్రసిద్ధ దేవాలయాలను ఒక సర్క్యూట్ కింద ఏర్పాటు చేసి, వాటి అభివృద్ధి, ఈకో టూరిజం దృష్టితో నివేదిక అందించేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించారు.
👉 మార్చి 31 నాటికి కన్సల్టెన్సీ అందించే నివేదికపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, మేడారంలో చేపట్టిన తరహాలోనే ఇతర దేవాలయాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసి, పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని మంత్రిమండలి అభిప్రాయపడింది.
👉 ఎల్ అండ్ టీ సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ అంశంపై సమగ్రంగా చర్చించిన మంత్రిమండలి, వచ్చే సమావేశం నాటికి తుది నిర్ణయం తీసుకోనుంది. ఈలోగా మెట్రో ఫేజ్–2లో భాగంగా A, B విస్తరణలకు సంబంధించిన భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అందుకు ₹ 787 కోట్లను కేటాయిస్తూ కేబినేట్ ఆమోదముద్ర వేసింది.
👉 హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) నుంచి శిల్పా లేఔట్ వరకు సుమారు 9 కి.మీ. మేరకు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది.
👉 నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో లా కాలేజీ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
