👉 దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా లభించిన పెట్టుబడి హామీల పై..
👉 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన !
J SURENDER KUMAR,
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన రెండేళ్లలో దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా రాష్ట్రానికి లభించిన పెట్టుబడి హామీలు, ప్రతిపాదనల పురోగతితో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో ఆకర్షించిన పెట్టుబడులు ఇప్పటివరకు ఏ స్థాయిలో అమలయ్యాయనే అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్షించారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను సాధించడమే ధ్యేయంగా దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ప్రపంచ ఆర్థిక సదస్సు)–2026 సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను, దానికి అనుగుణంగా రూపొందించిన క్యూర్ , ప్యూర్ , రేర్ ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయాలని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి నిర్దేశించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతోందని పునరుద్ఘాటించారు.
👉 పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణకు ఇప్పటికే ఉన్న బలాలు, సామర్థ్యాలను మరింతగా వినియోగించుకొని, మూడంచెల ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేలా రూపొందించిన క్యూర్ ప్యూర్ , రేర్ ప్రణాళికలను తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వేదికగా ప్రపంచానికి వివరిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
👉 “స్పిరిట్ ఆఫ్ డైలాగ్” అనే థీమ్‌తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సమ్మిట్ జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరగనుంది.
👉 గతంలో పెట్టుబడిదారులతో చేసుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించి, వాటి అమలుపై ఫాలోఅప్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇన్వెస్ట్మెంట్ గ్రౌండింగ్‌లో ఏవైనా సమస్యలు లేదా అడ్డంకులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.
👉 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన ఆర్థిక వృద్ధి ప్రణాళికలు, ప్రతిపాదనలను ప్రపంచ దేశాల పెట్టుబడిదారులకు సమర్థవంతంగా చేరవేసేందుకు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో విస్తృత స్థాయి సమావేశాలు, చర్చలు నిర్వహించనుంది.
