ఎస్సీ స్టడీ సర్కిల్ చరిత్ర సృష్టిస్తున్నది మంత్రి లక్ష్మణ్ కుమార్ !



👉 గ్రూప్–I తో పాటు వివిధ ఉన్నత ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల అభినందన సమావేశంలో !

J SURENDER KUMAR,

తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ రాష్ట్ర పాలనకు నూతన యువ అధికారులను అందిస్తూ చరిత్రలో మరో అధ్యాయాన్ని నమోదు చేసిందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

ప్రజాభవన్‌లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రూప్–Iతో పాటు వివిధ ఉన్నత ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

గ్రూప్–I ద్వారా డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, తదితర కీలక హోదాల్లో విద్యార్థులు ఎంపిక కావడం ప్రభుత్వ సంక్షేమ విధానాల విజయానికి నిదర్శనమన్నారు.

గ్రామీణ, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నత పరిపాలనా స్థాయికి చేరడం గర్వకారణమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం పదవి మాత్రమే కాదని, ప్రజల పట్ల గొప్ప బాధ్యత అని పేర్కొంటూ, నిజాయితీ, పారదర్శకత, సేవాభావంతో పాలన సాగించాలని కొత్త అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  ఎంపికైన విద్యార్థులను శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.