తెలంగాణలో టాటా గ్రూప్ సేవల విస్తరణ పై చర్చలు !

👉 దావోస్‌ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో..

J SURENDER KUMAR,

దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌ తో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, అభివృద్ధిలో భాగస్వామ్యం, పలు రంగాల్లో టాటా గ్రూప్ సేవల విస్తరణ వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు.


👉 తెలంగాణ రైజింగ్ విజన్–2047 అంశాలతో పాటు రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణం, ప్రభుత్వ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి  టాటా గ్రూప్ చైర్మన్ కు వివరించారు.


👉 కేవలం పెట్టుబడుల కోసమే కాకుండా, పటిష్టమైన విధానాలు, ఫ్యూచర్ విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలంగాణ ముందుకు సాగుతున్న తీరును చంద్రశేఖరన్  ప్రశంసించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలను అభినందించారు.


👉 హైదరాబాద్‌లోని ప్రధాన స్టేడియాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే ఆలోచనలను ముఖ్యమంత్రి  పంచుకోగా, దీనికి సానుకూలంగా స్పందించిన చంద్రశేఖరన్ , స్టేడియాల అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో ఉన్న క్రీడాప్రతిభకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. 2036 ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు సాధించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిని చేపట్టామని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.


👉 టాటా టెక్నాలజీస్ సహకారంతో తెలంగాణలోని 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చుతున్నామని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ సెంటర్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికలతో పాటు, ఆనంద్ మహీంద్రా  సారథ్యంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి  వివరించారు.


👉 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్  ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. రాజస్థాన్, మహారాష్ట్రలలో నీటి వనరుల పునరుద్ధరణలో టాటా గ్రూప్‌నకు ఉన్న అనుభవాన్ని గుర్తు చేస్తూ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి  తెలిపారు.


👉 ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలైన మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి చోట్ల హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. వీటితో పాటు ఏఐ డేటా సెంటర్లు, సెమీకండక్టర్, ఈవీ తయారీ రంగాల్లో కొత్త పరిశ్రమల స్థాపనపైనా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.