ఎయిర్ పోర్ట్ ను అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించాలి !

👉 కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి  కె. రామ్మోహ‌న్ నాయుడు కు సీఎం  రేవంత్ రెడ్డి  విజ్ఞ‌ప్తి !

J.SURENDER KUMAR,

తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ కు స‌మీపంలో నిర్మించ‌నున్న మామునూరు విమానాశ్రయాన్ని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించాల‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి  కె. రామ్మోహ‌న్ నాయుడు కు ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి  విజ్ఞ‌ప్తి చేశారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు.

👉 ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి  కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో పార్ల‌మెంట్‌లోని ఆయ‌న ఛాంబ‌ర్‌లో సమావేశమయ్యారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవ‌ల‌తో పాటు మెయింటెనెన్స్‌, ఓవ‌ర్ హాల్ రిపేర్ (ఎంఓఆర్‌) స‌దుపాయాలు ఉండేలా చూడాల‌ని ఈ సందర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.

👉 జౌళి, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో వ‌రంగ‌ల్ న‌గ‌రం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంద‌ని, వ‌రంగ‌ల్‌కు ద‌గ్గ‌ర‌లో రెండేళ్ల‌కోక‌సారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర‌ స‌మ్మ‌క్క‌ – సార‌ల‌మ్మ జాత‌ర మేడారంలో నిర్వహించడం వంటి ప్రాధాన్యతలను వివరించారు.

👉 వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్ట్ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌తో పాటు ఉమ్మ‌డి ఖ‌మ్మం, ఉమ్మ‌డి న‌ల్గొండ, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌కు కేంద్రంగా ఉంటుంద‌ని ముఖ్యమంత్రి  వివ‌రించారు. మామునూరు నుంచి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా విమాన రాక‌పోక‌లు సాగేలా ప‌నులు ప్రారంభించేలా అనుమతులను తక్షణం మంజూరు చేయాల‌ని కోరారు.

👉 విమానాశ్ర‌య ఏర్పాటుకు అద‌నంగా అవ‌స‌ర‌మైన 249.82 ఎక‌రాలు అంద‌జేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

👉 మామునూరు ఎయిర్‌పోర్ట్ ప‌నుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌కు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల‌ను అక్క‌డ‌కు పంపిస్తాన‌ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు  హామీ ఇచ్చారు.

👉 స‌మావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి , సురేశ్ షెట్కార్‌, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి , డాక్ట‌ర్ క‌డియం కావ్య‌ , గ‌డ్డం వంశీకృష్ణ‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.