👉 ఫిర్యాదు రాలేదు కేసు నమోదు కాలేదు బీర్పూర్ పోలీసులు !
J.SURENDER KUMAR
మూడు దశాబ్దాల క్రితం గుట్ట కింద గ్రామమైన తుంగూర్ అటవీశాఖ అధికారి రామస్వామి పై పీపుల్స్ వార్ నక్సలైట్లు దాడి చేసి కొట్టారు.. గత గురువారం అర్ధరాత్రి ఇదే గ్రామంలో అటవీ శాఖ అధికారి గంగారాంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. కొట్టింది ఎవరు ? అనేది మిస్టరీగా మారింది.
ఈగ్రామాలలో గతంలో నక్సలైట్లు ప్రజా కోర్టు నిర్వహించి అటవీ శాఖ అధికారి ఓదెల పై దాడి చేసి తీవ్రంగా హింసించారు. తుని కాకు సేకరణ, ప్లాంటేషన్ పనులలో కూలి డబ్బులు చెల్లించకపోవడం పోడు వ్యవసాయం ను అడ్డుకుంటున్నారు అనే తదితర కారణాల తో దాడి చేసినట్టు నాడు నక్సల్స్ వివరించుకున్నారు.
👉 నేడు ఎందుకు కొట్టారు ? ఎవరు కొట్టారు ?
నేడు నక్సలైట్లు, పోడు వ్యవసాయం, తునికాకు సేకరణ లేదు మరి అటవీశాఖ అధికారిపై దాడి ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? అనేది అధికార యంత్రాంగానికి తెలియనంత అమాయకత్వం వారిలో లేదు..
👉 మట్టి, ఇసుక, అక్రమ రవాణా కారణమా ?
అడవి ప్రాంతంలో మట్టి అక్రమ రవాణా, లేదా మంచిర్యాల జిల్లా బాదంపల్లి శివారు గోదావరి నది నుంచి ఈ ప్రాంతానికి ఇసుక రవాణా ( టైగర్ జోన్ పరిధి) ను అధికారి అడ్డుకోవడంతో దాడికి కారణమా ? అనే చర్చ మొదలైంది.
👉 నిద్రమత్తులో అటవీశాఖ అధికారులు !
తమ సహచర అధికారి, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే గ్రామంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. దాడి జరిగిన తీరుపై అటవీ శాఖ ఉద్యోగ సంఘాలలో కానీ, ఉన్నతాధికారులలో ఉలుకు లేదు, పలుకు లేదు, బాధితాధికారి భయంతో తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని. రహస్య ప్రదేశంలో ఉన్నట్టు సమాచారం.
👉 ఫిర్యాదు రాలేదు కేసు నమోదు చేయలేదు !
అటవీశాఖ అధికారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన అంశంపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, బాధిత అధికారి కానీ, సంబంధిత శాఖ వారు కాని ఫిర్యాదు చేయలేదని ఎలాంటి కేసు నమోదు కాలేదు అనే బీర్పూర్ ఎస్సై స్పష్టం చేశారు. దాడి అంశంలో అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ విచారణ జరిపితే అనేక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
