గత ప్రభుత్వంలో భార్యాభర్తల ఫోన్ సంభాషణలు విన్నారు !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

గత ప్రభుత్వంలో భార్యాభర్తలు ఫోన్‌లో మాట్లాడుకుంటే ట్యాప్ చేసి విన్నారని, అలా చేయడం దుర్మార్గమని, చివరికి జడ్జిలు, ప్రతిపక్ష నేతలు, సినీతారలను కూడా వదల్లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో బుధవారం జరిగిన  ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

👉 ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్​కు సిట్ నోటీసులిస్తే జాతిపితకు నోటీసు ఇస్తారా ? అని ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్​ మీ జాతికి పిత కావచ్చన్న ఆయన మీ జాతితో ప్రజలకు ఏం పని ? అని విమర్శించారు. హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్​ రావు, కృష్ణారావు వంటి నేతలు మీ జాతి కావచ్చని సీఎం ధ్వజమెత్తారు.

👉 ఘోర నేరాలు చేస్తే పోలీసులు ముసుగు తొడిగి పట్టుకుని వస్తారని, హరీశ్‌రావు, కేటీఆర్‌లను అలాగే పట్టుకుని రావాల్సిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగిందన్న రేవంత్​ రెడ్డి 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు.


👉ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురే లేదని, ఎవరూ తమ విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు. అభివృద్ధిని చూసి మున్సిపల్‌ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు.

👉 రేషన్‌ కార్డుల కోసం గతంలో పదేళ్లపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదన్న ఆయన రాష్ట్రంలో 3.17 కోట్ల మందికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. సన్న బియ్యం వచ్చిన వారు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయండని పిలుపునిచ్చారు. వరి ఉత్పత్తిలో మిర్యాలగూడ ఆసియాలోనే ముందు వరుసలో ఉందన్నారు.

👉 అందరికీ సంక్షేమ ఫలాలు !

రైతుభరోసా కింద ₹ 6 వేల చొప్పున ₹ 9 వేల కోట్లు ఇచ్చాను మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాక ఈ దఫా నిధులు జమచేస్తామని సీఎం వెల్లడించారు.

👉 దేశంలో అత్యధికంగా రైతుల కోసం ₹1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని, సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వివక్ష చూపలేదన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులకూ సైతం ఆర్టీసీ బస్సులో ప్రయాణం, సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు.

👉. రాష్ట్రంలోని అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న ఆయన నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్లను పేదలకు అందిస్తున్నట్లు తెలిపారు.

👉 ఏప్రిల్‌లో పెట్టబోయే కొత్త బడ్జెట్‌లో లక్షలాది ఇళ్లు పేదలకు ఇస్తామన్నారు. పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

👉 నల్గొండ జిల్లాపై కోపంతో ఎస్‌ఎల్‌బీసీని ప్రాజెక్టును పక్కనపెట్టారని, ఇక్కడి ప్రజలు విషపు నీళ్లు తాగడానికి బీఆర్‌ఎస్‌ కారణం కాదా అని ప్రశ్నించారు. రెండేళ్లలో పూర్తిచేసే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టామని ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోయారని గుర్తుచేశారు.


👉 ఎస్‌ఎల్‌బీసీ ఆగిపోతే మామ, అల్లుళ్లు దావతు చేసుకున్నారన్నా ఆయన నల్గొండపై విషం చిమ్ముతున్న బీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కు ఉందా? అని విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డలకు ₹ 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు.

👉 ఫాంహౌస్‌లు ప్రజలకు ఇస్తారా.!

మీకు నోటీసులు ఇస్తే అందరికీ ఇచ్చినట్లయితే ఎర్రవల్లి, జన్వాడ ఫాంహౌస్‌లు మా ప్రజలకు ఇస్తారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మొయినాబాద్‌లోని హరీశ్‌రావు ఫాంహౌస్‌లో అందరినీ రానిస్తారా ?, వేల కోట్లు కొల్లగొట్టిన దాంట్లో నిరుద్యోగులకు ఏమైనా ఇస్తారా? అని పెదవి విరిచారు.

👉 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, మంత్రి పదవులు అన్నీ మీ కుటుంబమే తీసుకుందని బీఆర్​ఎస్​ను నిలదీశారు. తెలంగాణ సమాజానికి ఏమైనా ఇచ్చారా ?, చివరికి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి కూడా ఏమీ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

👉 అభివృద్ధిని చూసి మున్సిపల్‌ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి. రేషన్‌ కార్డుల కోసం గతంలో పదేళ్లపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో 3.17 కోట్ల మందికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నాం.

👉 రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ₹ 500 బోనస్‌ ఇస్తున్నాం. రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మందికి ₹ 21 వేల కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా కింద ₹.6 వేల చొప్పున ₹.9 వేల కోట్లు ఇచ్చాం. మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాక రైతుభరోసా నిధులు జమచేస్తాం” 

👉 ధైర్యంగా ఉండండి

తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన జయశంకర్‌ జాతిపిత అవుతారని, రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ, తెలంగాణ తల్లి అవుతారని సీఎం అన్నారు. దోపిడీలు, దుర్మార్గాలు చేసిన వారు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు ? అని ప్రశ్నించారు.

👉 చేసిన తప్పులకు తలవంచుకుని ముక్కు నేలకు రాయాల్సింది పోయి తెలంగాణ సమాజాన్ని క్షమాపణ కోరకుండా సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉 2018లో జానారెడ్డి కుమారుడికి కాకుండా భాస్కర్‌రావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్‌ ఇస్తే మిర్యాలగూడ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో తాకట్టు పెట్టారని అన్నారు.

👉 కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లు వాపసు తీసుకోవాలని భాస్కర్‌రావు బెదిరిస్తున్నారన్న సీఎం కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని చెప్పారు.

👉 భాస్కర్​రావును నమ్మి ఎమ్మెల్యేను చేస్తే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి ఓటమికి పనిచేశారని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ గెలిచి తీరాలని నాయకులకు సూచించారు. వేల కోట్లు తీసుకువచ్చి మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తామని, ఎన్నికల తర్వాత సాగర్‌, నందికొండలోని ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.