👉 సంత్ సేవాలాల్ బోధనలు నేటి తరానికి దిశానిర్దేశం !
👉 గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవంగా, సమాజ సంస్కర్తగా గిరిజన సమాజ ఆత్మగౌరవానికి ప్రతీక సేవాలాల్.సంత్ సేవాలాల్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గం నేటి తరానికి దిశానిర్దేశంగా నిలుస్తుందని, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనియాడారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బంజారా భవన్ లో ఆదివారం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ..
“విద్యే ఆయుధం… సమానత్వమే లక్ష్యం… గిరిజనుల ఆత్మగౌరవమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అడ్లూరి అభివర్ణించారు. సంత్ సేవాలాల్ అనంతపూర్ జిల్లా రామ్ నాయక్ తండలో జన్మించినప్పటికీ, తన జీవితం మొత్తాన్ని గిరిజనుల అభ్యున్నతికే అంకితం చేశారని మంత్రి తెలిపారు. మద్యపానానికి బానిస కాకుండా, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని బోధిస్తూ గిరిజన సమాజంలో పెను మార్పులకు దోహదపడ్డ గొప్ప సంస్కర్తగా సేవాలాల్ నిలిచారని కొనియాడారు.
👉 సంతు సేవాలాల్ బోధించిన సమానత్వం, సత్యం, శ్రమ, సామాజిక ఔన్నత్యం వంటి విలువలు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని అన్నారు.
👉 రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇది గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని స్పష్టం చేశారు.
👉 గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు.
👉 ఐటీడీఏలను బలోపేతం చేస్తూ ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, డిగ్రీ కళాశాలలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. గిరిజన విద్యార్థులు ఐఐటీ, జె ఈ ఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ కళాశాలలో అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ప్రముఖ మెడికల్ కళాశాలలో ఎయిమ్స్ లాంటి వైద్య కళాశాలలో
ఎంబిబిఎస్ సీట్లను అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఉచిత సీట్లు సంపాదించి అద్భుత విజయాలు సాధిస్తున్నారని, ఇందుకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్న ఉచిత కోచింగ్ ప్రధాన కారణమని చెప్పారు.
👉 ప్రజాపాలనలో గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చిన కోచింగ్ ద్వారా అనేక మంది యువత డీఎస్పీలు, ఆర్డీవోలు వంటి ఉన్నత ఉద్యోగాలు సాధించారని గర్వంగా తెలిపారు. ఇది గిరిజన యువతలో కొత్త ఆశలను నింపుతోందన్నారు.
👉 ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం తొమ్మిది నెలల్లోనే ₹200 కోట్ల నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించారని మంత్రి గుర్తు చేశారు. కోట్లాది మంది భక్తులు జాతరను దర్శించుకునేలా చేసిన ప్రభుత్వ ఏర్పాట్లు గిరిజనుల పట్ల ఉన్న నిబద్ధతను చాటిచెప్పాయని అన్నారు.
👉 దివంగత ప్రధాని ఇందిరమ్మ గిరిజనులకు మొట్టమొదటిగా రిజర్వేషన్లు, ఇళ్ల పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, దళిత–గిరిజన వర్గాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పునరుద్ఘాటించారు.
👉 ప్రజా పాలనలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దళిత గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో మార్పులు చేశారని..ఎస్సీ వర్గీకరణతో పాటు గిరిజన సంక్షేమము కోసం కట్టుబడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దళిత గిరిజన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీరామరక్షని ఆయన కొనియాడారు.
👉 తాను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెనూ ఎంతో మెరుగ్గా ఉందని విద్యార్థులే తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వారానికి ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో వంటకాన్ని పోషకాహారంతో కూడిన మెనూ అమలు చేస్తూ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు.
👉 సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసిన కేంద్ర గిరిజన శాఖ మంత్రిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ప్రత్యేకంగా కోరగా, పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ విషయంలో కేంద్రం–రాష్ట్రం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
👉 అంతేకాకుండా సంత్ సేవాలాల్ లంబాడీల అభ్యున్నతికై తెలంగాణలోని బంజారాహిల్స్ తో పాటు పలు ప్రాంతాలు పర్యటించిన నేపధ్యంలో, బంజారాలు పవిత్రంగా భావించే నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల్ల అడవుల్లో భారీ విగ్రహం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి సహకరించాలని కోరారు. ఇది గిరిజనుల ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలుస్తుందని చెప్పారు.
👉 సేవాలాల్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ విద్య, ఉపాధి, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వమే లక్ష్యంగా గిరిజన సమాజాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి రవీందర్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు సముజ్వల, చీఫ్ ఇంజనీర్ బాలునాయక్, జిసిసి జీఎం ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నత అధికారులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
