గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ లతో సమీక్ష !

👉 జిల్లా కలెక్టర్లతో  దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం !

J.SURENDER KUMAR,

2027 లో జరగనున్న గోదావరి పుష్కరాలు  నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జిల్లా కలెక్టర్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరేట్ నుండి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.


👉 వీడియో కాన్ఫరెన్స్ లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు.

👉 వి ఐ పి ఘాట్లు, పుష్కర ఘాట్‌ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్‌ల ఏర్పాటు, భద్రతా చర్యలు, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య శిబిరాల ఏర్పాటు వంటి అంశాలపై జిల్లా వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

👉 ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాల గుర్తింపు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు.

👉 పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు గోదావరి తీరం వద్దకు చేరుకునే అవకాశం ఉన్నందున, ముందస్తు అంచనాలపై ఆధారపడి మౌలిక వసతులను బలోపేతం చేయాలని కమిషనర్ పేర్కొన్నారు.

👉 దేవాలయాల వద్ద దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ, ప్రత్యేక పూజల సమన్వయం వంటి అంశాలను కూడా సమగ్రంగా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు.

👉 ప్రచార కార్యక్రమాల ద్వారా భక్తులకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచాలని, అధికారుల మధ్య సమన్వయం ఉండేలా నోడల్ అధికారులను నియమించాలని సూచించారు.

👉 పర్యావరణ పరిరక్షణ చర్యలు, ప్లాస్టిక్ నిషేధం, ఘాట్‌ల వద్ద పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

👉 కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ….

జగిత్యాల జిల్లాల్లో గోదావరి పుష్కరాలకు చేపట్టిన ప్రాథమిక ఏర్పాట్ల వివరాలను ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్నిరకాల కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని తెలిపారు.


ఈ సమావేశంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.