👉 ఈ నెల 17, 18 రెండు రోజుల పాటు !
👉 ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరగబోయే బయోఏషియా-2026 సదస్సు ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనుంది.
👉 ఈ ప్రపంచ స్థాయి సదస్సు ప్రధానంగా ‘టెక్‌బయో అన్‌లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు. టెక్‌బయో ఇన్నోవేషన్స్‌లో దేశం గ్లోబల్ హబ్‌గా మారుతున్న తరుణంలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో లైఫ్ సైన్సెస్ రంగంలో భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ సంబంధించిన అంశాలపై ఈ సదస్సు చర్చించనుంది.
👉 లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు చేసే అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం బయోఏషియా సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, బయో సైన్సెస్ రంగంలో నిష్ణాతులు ఆయా అంశాలపై ప్రసంగించనున్నారు.

👉 పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, అమెరికాకు చెందిన ఆమ్జెన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వై చాంగ్ కీలకోపన్యాసం చేయనున్నారు.
👉 సైన్స్, సాఫ్ట్‌వేర్ అండ్ సప్లయ్, నెక్స్ట్ జనరేషన్ బయోలాజిక్స్, ఫార్మా, బయోటెక్ భవిష్యత్తు, ఏఐ, ఆర్ అండ్ డీ (డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్), గ్లోబల్ ఇంపాక్ట్, తెలంగాణ రైజింగ్ 2047 – వరల్డ్-క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ వంటి కీలక అంశాలపై జరిగే చర్చల్లో వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు పాల్గొంటారు.
