హైదరాబాద్‌లో పెట్టుబడులకు ప్రభుత్వ సహకారం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. ఈ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అనేక సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయని పారిశ్రామిక వేత్తలకు వివరించారు.

👉 హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మక బయోఏషియా 2026 ప్రపంచస్థాయి సదస్సు ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి  పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

👉  జీవవైజ్ఞానిక రంగంలో జీసీసీలు, ముఖ్యంగా ఇన్నొవేషన్ సెంటర్ల ఏర్పాటుకు అనుగుణంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకమైన జోన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  సంకల్పించారు.

👉 దిగ్గజ కంపెనీల భేటీ సందర్భంగా పెట్టుబడులకు సంబంధించి కుదిరిన పలు ఒప్పందాలు:

@  గ్లోబల్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ కంపెనీ అయిన ఒపెలా హెల్త్‌కేర్, 42 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ త్వరలోనే  కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ సంస్థ వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను కల్పిస్తుంది.

@  ఇండొనేషియాకు చెందిన జేఏపీఎఫ్ఏ అంతర్భాగమైన వాక్సిండో ఎనిమల్ హెల్త్‌కేర్ విభాగం జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బీఎస్ఎల్-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, స్వైన్, ఆక్వాకల్చర్ రంగానికి అవసరమైన వ్యాక్సీన్లను ఉత్పత్తి చేస్తుంది.

@  ప్రముఖ ఏఐ, డేటా సైన్స్ కంపెనీ ట్రిడెన్స్ ఇన్‌కార్పొరేషన్ హైదరాబాద్ కేంద్రంగా ఏఐ-ఆధారిత హెల్త్ కేర్‌, లైఫ్ సైన్సెస్‌పై కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కేంద్రం సుమారు 18 వేల చ. అడుగుల ప్రత్యేకమైన ఇన్నొవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తుంది.

@  భారతదేశ లైఫ్ సైన్సెస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఆర్ఎక్స్‌ ప్రొపెల్లెంట్ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో పెద్ద ఎత్తున లైఫ్ సైన్సెస్ క్యాంపస్‌ను నెలకొల్పుతుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో అన్ని మౌలిక సదుపాయాలతో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తుంది. వచ్చే ఆరేళ్లలో ఈ సంస్థ పూర్తిస్థాయి కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

👉 ఈ భేటీలో తెలంగాణ ఇండ‌స్ట్రీయ‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ శ్రీమతి నిర్మ‌లా జ‌గ్గారెడ్డి , స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ సంజ‌య్ కుమార్  పాల్గొన్నారు.