👉 మంత్రి అడ్లూరీ కి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు !
👉 జగిత్యాల మునిసిపల్ కొలిక్కి..?
J.SURENDER KUMAR,
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించినప్పటికీ జగిత్యాల మున్సిపాలిటీ తో పాటు రాయికల్ మున్సిపాలిటీలో ఉన్న అనిచ్చితిని తొలగించడానికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి శుక్రవారం రాత్రి మంత్రి లక్ష్మణ్ కుమార్ తో మాట్లాడినట్టు సమాచారం.
శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా జగిత్యాల మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య ఉన్న విభేదాల అంశం చర్చకు వచ్చింది.
జగిత్యాల, రాయికల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగే విధంగా చూడాలని సీఎం మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ సచిన్ సావంత్ తోపాటు, కు బాధ్యతలు అప్పగించారు. ఇద్దరు నేతలు చొరవ తీసుకొని జగిత్యాలతో పాటు రాయికల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
👉 మాజీమంత్రి జీవన్ రెడ్డిని తో మంత్రి లక్ష్మణ్ కుమార్ చర్చలు ?
శనివారం ఉదయం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్, హుటా హుటిగా ఒంటరిగా జగిత్యాల కు వెళ్లి మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో దాదాపు గంటపాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్టు సమాచారం. జగిత్యాల నుంచి హైదరాబాద్ కు వెళ్లి సాయంత్రం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో మంత్రి లక్ష్మణ్ కుమార్ చర్చించినట్లు తెలిసింది.
జీవన్ రెడ్డి వర్గం కౌన్సిలర్లు శనివారం రాత్రి క్యాంపుకు తరలి వెళ్లారు వారి వెంట జీవన్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. ఓ వర్గానికి చైర్మన్, మరో వర్గానికి వైస్ చైర్మన్, నాలుగు కో ఆప్షన్ సభ్యులలో రెండేసి చొప్పున శనివారం అర్ధరాత్రి అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం సీల్డ్ కవర్ లో సోమవారం ఉదయం జగిత్యాలకు పంపే ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. క్యాంపు లో ఉన్న ఇరు వర్గాల కౌన్సిలర్లతో ఆదివారం కొన్ని పత్రాలపై సంతకాలు సేకరించినట్టు తెలిసింది.
