👉 తెలంగాణ పోలీసులా ? మల్లోజుల వేణుగోపాలా ?
J.SURENDER KUMAR,
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు మంగళవారం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కీలక అగ్ర నేతల లొంగుబాటుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసి అమలు చేసింది తెలంగాణ పోలీస్ యంత్రాంగమా ? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫండవిస్ ముందు 2025 లో లొంగిన కేంద్ర కమిటీ బ్యూరో సభ్యుడు, సిద్ధాంతకర్త, మల్లోజుల వేణుగోపాలా @ అభయ్,@ సోను దాదానా ? అనే చర్చ జరుగుతున్నది.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి,@ దేవుజీ @ కుమ్మా దాదా, (44 సంవత్సరాలు అజ్ఞాతం) కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి @ సంగ్రామం.(46 సంవత్సరాల అజ్ఞాతం) తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) కార్యదర్శి బడే చొక్కారావు,@ దామోదర్,@ జగన్ (28 సంవత్సరాల అజ్ఞాతం) రాష్ట్ర కమిటీ సభ్యుడు (SCM) నూనె నర్సింహా రెడ్డి @గంగన్న ,@ సన్ను దాదా.(36 సంవత్సరాల అజ్ఞాతం) వీరితోపాటు మరో 40 మంది కీలక మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిన విషయం విధితమే.
👉 దండకారణ్యం నుంచి జనారణ్యంలోకి ఎలా ?

కగార్ ఆపరేషన్ పేరిట దండకారణ్యంలో ఐదు కిలోమీటర్లకు ఒ పోలీస్ చెక్ పోస్ట్, అవుట్ పోస్ట్, భద్రతా దళాలు, బస్టర్ ఫైటర్స్, డి ఆర్ జి బలగాలు, ఫారెస్ట్ బ్లాక్, వీరి కంట పడకుండా కీలక అగ్రనేతలు జనారణ్యంలోకి (తెలంగాణకు) ఎలా చేరుకున్నారో ? అనేది చర్చ..

ఈచర్చకు కారణం ఛత్తీస్గడ్ .ఒరిస్సా దండకారణ్యాలలో మావోయిస్టుల అలికిడి వినిపించిన, కదలికలు కనిపించిన, భద్రత దళాలు, బస్టర్ ఫైటర్స్, డిఆర్ జీ బలగాలు చుట్టుముట్టి కాల్చి చంపి కర్రలకు కట్టుకొని ఆ శవాలను బేస్ క్యాంపులకు తెచ్చి అవార్డులు అందుకున్న సంఘటనలు అనేకం రెండేళ్ల కాలంలో వందలాది మందిని కాల్చి చంపిన ఉదంతాలు అనేకం.

👉 మల్లోజులా ఆశన్నల లొంగుబాటు తీరే వేరు !
మావోయిస్ట్ సీనియర్ నాయకుడు, వ్యూహకర్త మల్లోజుల వేణుగోపాల్ రావు @ అభయ్ @ సోను దాదా మరో 60 మంది దళ సభ్యులు ఆయుధాలతో 2025 అక్టోబర్ మహారాష్ట్ర సీఎం ఈ దేవేందర్ ఫండవీస్ ముందు గడిచిరోలి లో లొంగిపోయారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సాయుధ పోరాటాన్ని విరమించాలని దళాలకు పిలుపునిస్తూ లేఖలు రాస్తు వేణుగోపాల్ మావోయిస్టు పార్టీకి దూరమైన విషయం విధితమే.
👉 రూపేష్….
తక్కలపల్లి వాసుదేవరావు @ రూపేష్ @ అశన్న దాదాపు రెండు వందల మంది మావోయిస్టులు, అధునాతనమైన ఏకే 47, ఎస్ఎల్ఆర్, రైఫిల్స్ దాదాపు 150 ఆయుధాలతో చతిస్గడ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ సమక్షంలో 2025 అక్టోబర్ లో లొంగిన విషయం తెలిసిందే.. అభయ్, రూపేష్ లు దండకారణ్యంలోని దళాలకు మీరు ఆయుధాలు వీడి ప్రభుత్వాలకు సరెండర్ కావాలి అనుకుంటే, మమ్మల్ని సంప్రదించండి అంటూ ఇద్దరూ తమ తమ మొబైల్ ఫోన్ నంబర్ లు ప్రకటిస్తూ, ప్రచార మాధ్యమాల్లో పదే పదే ప్రదర్శించారు.
👉 ముందస్తుగా ప్రభుత్వాల రాడార్ లోకి..
కగార్ ఆపరేషన్ కొనసాగుతుండగా దండకారణ్యంలో రెప్పవాల్చని భద్రతా దళాల నిఘా నీడను తప్పించుకొని వందలాదిమంది సాయుధ మావోయిస్టులు దండకారణ్యంలో తమ రహస్య స్థావరాల నుంచి దాదాపు వంద కిలోమీటర్లు దూరంలో ఉన్న పోలీస్ బేస్ క్యాంపు వరకు చేరుకొని సరెండర్ అయ్యారు అంటే కీలక నాయకులు ముందస్తుగా ప్రభుత్వ రాడార్ లోకి వెళ్లి లొంగుబాటు మార్గంలో అనధికార కాల్పుల విరమణ ఒప్పందం జరిగి ఉండవచ్చు అనేది చర్చ.
👉 దండకారణ్యంలో కాల్పులు జరగలేదు !
వేణుగోపాల్, సాయుధ పోరాటం వద్దు అంటూ దళాలకు అభయ్ పేరిట విడుదల చేసిన లేఖలు 2025 ఆగస్టులో ప్రచార సాధనాల్లో వెలుగు చూశాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ మొదటి వారం వరకు దండకారణ్యంలో కాల్పులు జరగలేదు. వేణుగోపాల్, రూపేష్ లు వందలాదిమంది సాయుధ అనుచరులతో అక్టోబర్ లో ఛత్తీస్గడ్, మహారాష్ట్ర సీఎంల ముందు లొంగిపోవడం ప్రస్తావనారం.
👉 చత్తీస్గడ్ హోం మంత్రితో గెట్ టుగెదర్..?
వివిధ యూనివర్సిటీలకు చెందిన కొందరు ప్రొఫెసర్ లు, మేధావులు, ప్రజాస్వామికవాదులు తెలంగాణ పౌర హక్కుల సంఘం నాయకులు చత్తీస్గడ్ లో హోంమంత్రి తో 2025 నవంబర్ మొదటి వారంలో గెట్ టుగెదర్ జరిగినట్టు చర్చ. సాయుధ పోరాట విరమణ, అజ్ఞాతంలో ఉండి ఏమి సాధించలేరని, జనజీవన స్రవంతి లోకి వారు రావాలని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గెట్ టుగెదర్ లో వీరికి హోంమంత్రి వివరించినట్టు చర్చ. అజ్ఞాతంలో ఉన్న వారిని జనజీవన స్రవంతిలోకి రమ్మని కోరుతామని గెట్ టుగెదర్ లో పాల్గొన్న ప్రజాస్వామ్యవాదులు అన్నట్టు చర్చ.
👉 హిడ్మా ఒరిస్సా అడవుల నుండి ఆంధ్రాలో అడుగుపెట్టగానే హతం !
లొంగుబాటు కోసమో ? వైద్య చికిత్స కోసమా ? తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ కు మధ్యవర్తుల ద్వారా వచ్చిన మోస్ట్ వాంటెడ్ గెరిల్లా ఆర్మీ చీఫ్ మద్వి హిడ్మా తో తో పాటు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2025 నవంబర్ చివరి వారంలో జరిగిన ఎన్కౌంటర్లో మద్వి హిడ్మా అతడి భార్య మరో నలుగురు హతమవడం , దాదాపు 50 మంది మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాలలో అరెస్టు అయ్యారు.
👉 బలార్షా నుంచి తెలంగాణలో ఆసిఫాబాద్ అడవుల వరకు మావోయిస్టులకు సేఫ్ జోన్ ?
మహారాష్ట్ర సీఎం ముందు మల్లోజుల వేణుగోపాల్ భార్య గడిచిరోలి దళ నాయకురాలు దళ సభ్యులతో కలిసి తార 2025 జనవరిలో సరెండర్ అయింది. వేణుగోపాల్ , మరో 60 మంది దళ సభ్యులతో 2025 అక్టోబర్ లో మహారాష్ట్ర సీఎం ముందు సరెండర్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లా జంగల్ మహల్ లో 2011 నవంబర్ చివరివారంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు @ కిషన్ జి హతమయ్యారు. ఆయన భార్య పోతుల సునీత@ పద్మావతి@కల్పన 40 సంవత్సరాల అజ్ఞాతవాసం వీడి 2025 సెప్టెంబర్ రెండవ వారంలో తెలంగాణ డిజిపి డి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.
కేంద్ర కమిటీ సభ్యులు నాలుగున్నర దశాబ్దాలు మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పుల్లూరి ప్రసాదరావు, @ చంద్రన్న, బండి ప్రకాష్ @ ప్రభాస్ 2025 అక్టోబర్ లో డిజిపి ముందు లొంగిపోయారు. కీలక మావోయిస్టు నాయకులు కంకణాల రాజిరెడ్డి @ దేవా, బాడ్సే సుక్క మరో 18 మంది మావోయిస్టులు ఆయుధాలతో 2026 జనవరిలో తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు.
👉 డిజిపి శివధర్ రెడ్డి పక్కా స్కెచ్ తో లొంగుబాట్లు కావచ్చు ?
డిజిపి శివధర్ రెడ్డి గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా, నక్సల్స్ ను అణచివేతలో గ్రేహౌండ్ దళాలు అధిపతిగా అనుభవంతో పాటు పోలీస్ అమరవీరుల స్మరణ దినోత్సవం సందర్భంగా మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రావలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి కి అనుగుణంగా స్కెచ్ అమలు చేసినట్టు చర్చ.

దీనికి తోడు సహచర మిత్రులు ఆయుధాలు, అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతి లోకి రండి అంటూ మల్లోజుల వేణుగోపాల్, రూపేష్, పదే పదే చేసినా చేస్తున్న విజ్ఞప్తుల మేరకు డిజిపి లొంగుబాటు కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్టు చర్చ. మల్లోజుల వేణుగోపాల్ , రూపేష్ ల సమకాలికులైన తిప్పరి తిరుపతి,@ దేవ్ జి, మల్ల రాజిరెడ్డి,@ సంగ్రామ్ నూనె నరసింహారెడ్డి, @ సన్ను దాదా, బడే చొక్కా రావు, @ జగన్ మరో 40 మంది మావోయిస్టులు దండకారణ్యం నుంచి సురక్షితంగా హైదరాబాదుకు తరలివచ్చేలా రూట్ మ్యాప్ కు రూపకల్పన చేసింది తెలంగాణ పోలీసులా ? మల్లోజుల వేణుగోపాలా ? ఎవరు అనేది కొంతకాలానికి వెలుగు చూడవచ్చు..
