నల్లమల అటవీ ప్రాంతంలో సేవాలాల్ పుణ్యక్షేత్రం నిర్మిస్తాం !

👉 వచ్చే ఏడాది బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్  జయంతి ఉత్సవాలు అక్కడే!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్  పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని అన్నారు.


👉 ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం, మేడారంలో సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదని పేర్కొన్నారు. అందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించినందున, అక్కడ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


👉 రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారా భవన్‌లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎంపీ పొరిక బలరాం నాయక్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


👉 తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, అందుకోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. కనెక్టివిటీ కోసం బీటీ రోడ్డుతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల, పంచాయతీ భవనం ఉండాలని చెప్పారు.


👉 “మానవజాతి శాంతి మార్గంలో, చెడును విడిచి, భక్తితో సన్మార్గంలో నడవాలని బోధించిన సంత్ సేవాలాల్ దేశంలో 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. అలాంటి మహనీయుని జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత.


👉 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, పునర్నిర్మాణంలో లంబాడా సోదరుల పాత్ర ఎవరూ మరువలేనిది. వారికి సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. 2006 నుంచి ఇప్పటివరకు ప్రతి సందర్భంలోనూ లంబాడా సోదరులు నాకు అండగా నిలబడ్డారు.


👉 ప్రతి తండాలో పాఠశాల భవనం, పంచాయతీ భవన నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలి. తాగడానికి మంచినీరు, కరెంట్ అందించాలి. అటవీ ప్రాంతాల్లో ఉండే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కరెంట్ లేని చోట సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ గిరిజనులకు ప్రాధాన్యతనిస్తున్నాం.


👉 ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది. నిరుపేదలకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవు. చదువు లేని కారణంగా చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారు. అందుకే నిరుపేదలు చదువుకోవడానికి కావలసిన అన్ని వసతులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. నిర్దిష్టమైన ప్రణాళికలతో కష్టపడి చదువుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలి” అని ముఖ్యమంత్రి  ఉద్బోధించారు.


👉 కార్యక్రమంలో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్  విగ్రహానికి ముఖ్యమంత్రి  పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు బంజారాలు ప్రదర్శించిన ఉత్పత్పులను పరిశీలించారు.