రైలు మార్గాన్ని కేంద్ర నిధుల‌తో చేపట్టాలి !

👉 రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌ కు ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి  విజ్ఞ‌ప్తి !

J.SURENDER KUMAR,

కృష్ణా – వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధుల‌తో చేప‌ట్టాల‌ని రైల్వే శాఖ మంత్రి  అశ్వినీ వైష్ణ‌వ్‌ కు  ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి  విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేక‌ర‌ణ వ్య‌యాన్ని మొత్తం  రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న విషయం తెలియ‌జేశామని గుర్తు చేశారు.


👉 ఢిల్లీలో అశ్వినీ వైష్ణ‌వ్‌ తో గురువారం పార్ల‌మెంట్‌లోని ఆయన ఛాంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రి  భేటీ అయ్యారు. కృష్ణా – వికారాబాద్ మార్గంలోని టేక‌ల్‌కోడ్ లో లైమ్ స్టోన్ నిక్షేపాల‌ను గుర్తించామ‌ని, అలాగే సిమెంట్‌, జౌళి ప‌రిశ్ర‌మ‌ల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు వివరాలను కేంద్ర మంత్రికి అందించారు.


👉 ముఖ్యమంత్రి  తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు క‌ర్ణాట‌క‌లోని ప‌లు సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌మీపంలో కృష్ణా ప్రాంతం ఉంద‌ని చెప్పారు. కొడంగ‌ల్‌, టేక‌ల్‌కోడ్‌, దౌల్తాబాద్‌ల‌ను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు.


👉 హైద‌రాబాద్‌ – చెన్నై (778 కి.మీ.), హైద‌రాబాద్‌ – బెంగ‌ళూర్ (586 కి.మీ.), హైద‌రాబాద్‌ – పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స‌మీపంలో 500 ఎక‌రాల స్థ‌లం కేటాయిస్తామ‌ని కేంద్ర మంత్రికి తెలిపారు.


👉 శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే హైస్పీడ్ రైలు మార్గాల‌ని ప్రారంభించాల‌ని ముఖ్యమంత్రి   సూచించారు. హైద‌రాబాద్‌ – చెన్నై హైస్పీడ్ కారిడార్ అమ‌రావతి మీదుగా వెళుతుంద‌ని, అక్క‌డి నుంచి బంద‌రు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాల‌ని కోరారు.


👉 తద్వారా డ్రైపోర్ట్ నుంచి బంద‌రు పోర్టుకు స‌ర‌కు ర‌వాణా వేగ‌వంతం అవుతుంద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌ – బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ – పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే ప్రారంభమైతే అది ట్రై జంక్ష‌న్ అవుతుంద‌న్నారు.


👉 మూడు కారిడార్ల‌కు భూ సేక‌ర‌ణ వెంట‌నే చేప‌ట్టి ప‌నులు ప్రారంభించాల‌ని కోరగా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్  సానుకూల‌త వ్య‌క్తం చేశారు. ప‌నులు ప్రారంభిస్తామ‌ని హామీ ఇచ్చారు.


👉 ముఖ్యమంత్రి తో పాటు స‌మావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి , సురేశ్ షెట్కార్‌ , రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి , డాక్ట‌ర్ క‌డియం కావ్య‌ , గ‌డ్డం వంశీకృష్ణ‌ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.