రాజకీయ పార్టీలు – కార్పొరేట్ సంస్కృతి !

👉 జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ల రాజకీయ ప్రయాణం నాయకులకు ఓ పాఠం !

J.SURENDER KUMAR,

ప్రజాస్వామ్యం ప్రజావాణికి ప్రతిరూపం. ఆ స్వరాన్ని సంఘటితం చేసి పాలన దిశగా నడిపించే వాహనాలే రాజకీయ పార్టీలు.
ఒకప్పుడు రాజకీయ పార్టీలు అనగానే ( అంటే ) సిద్ధాంతాలు, సేవ, త్యాగం లాంటి పదాలు గుర్తుకొచ్చేవి. పార్టీల గుర్తులు కూడా వాటి వాటి సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండి స్ఫూర్తినిచ్చేవి. కాని నేటి రాజకీయ పార్టీలు ప్రజాసేవ రథాలుగా కాక లాభాపేక్షనే ధ్యేయంగా నడిచే కార్పొరేట్ సంస్థల మాదిరిగా మారుతున్నాయన్న భావన ప్రజలలో బలపడుతోంది.

ఈ మార్పు కాలక్రమేణా ఆధునిక సమాజంలో వస్తున్న సహజ పరిణామ ప్రభావమా ? లేక ప్రజాస్వామ్యానికి ముంచుకొస్తున్న మౌనమైన ముప్పా ?  అనే ప్రశ్నకు సమాధానం సమాజం వెతకవలసిన అవసరం ఉన్నది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజల సంక్షేమం, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మూల్యాలే రాజకీయ పార్టీల అసలు లక్ష్యంగా ఉండాలి. కాని నేటి రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారాన్ని చేజిక్కించుకోవడంగా మారింది. కాలక్రమేణా రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో కార్పొరేట్ సంస్కృతి ప్రభావం పెరుగుతూ వస్తోంది. ఈ ప్రభావం రాజకీయ వ్యవస్థ యొక్క మూల స్వరూపాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

👉 పార్టీల్లో కార్పొరేట్ ఆలోచనల ప్రవేశం !

కార్పొరేట్ సంస్థల ముఖ్య లక్ష్యం లాభార్జన, పెట్టుబడిదారుల సంపద పెంచడం. కార్పొరేట్ సంస్కృతి అనేది ప్రధానంగా లాభాపేక్ష, పోటీ, అధికార కేంద్రీకరణ, వేగవంతమైన నిర్ణయాలు, మార్కెటింగ్ వ్యూహాలపై ఆధారపడిన విధానం. ఇలాంటి ఆలోచనా ధోరణులు రాజకీయ పార్టీల్లో ప్రవేశించడంతో ప్రజాసేవ స్థానంలో లాభసాధన, ప్రజాహితానికి బదులుగా వ్యక్తిగత,  లేదా కార్పొరేట్ ప్రయోజనాలు ముందుకు వస్తున్నాయి.

రాజకీయాలు, సేవా రంగంగా కాకుండా ఒక వ్యాపార రంగంలా మారుతున్నాయి. కొత్త కొత్త ప్రకటనల మార్గాలు, నిపుణులైన స్ట్రాటెజిస్ట్ లను నియమించడం, వారికి కోట్లాది రూపాయలు ఫీజుల రూపంలో చెల్లిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఈ ధోరణి మరింత వింత పోకడలు పోతున్నది. “కాదేదీ కవితకనర్హం” అన్నట్టుగా “కాదేదీ ప్రచారానికనార్హం” అనే ధోరణితో డబ్బు, మద్యం, ప్రచార మాధ్యమాల కొనుగోలు, ప్రలోభాలు లాంటివి వాటి వాటి విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి.

👉 పార్టీలు – వ్యూహాలు …

కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ వస్తు సేవలను ప్రజలలోకి తీసుకువెళ్లడం లో ముందు సర్వత్రా వ్యాప్తి-ఫలితాలు తరువాత అన్నది తమ ప్రత్యర్ధులకు అవకాశమివ్వకుండా చేయడానికి పన్నే ఒక వ్యూహం. అదే వ్యూహాన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి.

దీనికి గత హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఓ ఉదాహరణ. ఈ వ్యూహం తమ పార్టీని ప్రజల్లోకి ప్రకటనలు, ఫ్లెక్సీ ల రూపంలో తీసుకుపోవడం కన్నా ఇతర పార్టీలకు స్థానం ఇవ్వ కూడదనే జుగుప్సాకర వ్యూహం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. గుత్తాధిపత్య ధోరణులు రాజకీయ పార్టీల్లోకి పాకుతున్నాయి.

👉 పార్టీలు- డబ్బు ప్రభావం ….

నేటి రాజకీయాల్లో నాయకత్వం ప్రజల నుంచి సహజంగా ఎదిగినదిగా కాకుండా, ఆర్థిక శక్తి ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. పార్టీ టికెట్ల పంపిణీ, ఎన్నికల వ్యయాలు, ప్రచార విధానాలు అన్నీ కార్పొరేట్ సంస్థల నిర్వహణ పద్ధతులను తలపిస్తున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలకు రాజకీయాల్లో ప్రవేశించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. డబ్బు పార్టీలను శాసిస్తోంది.
డబ్బు పార్టీలను ఆడిస్తోంది. ఫలితంగా రాజకీయ విలువలు పడిపోయి మంచి నాయకత్వం లోపిస్తోంది.

👉 ఓటర్లు- కస్టమర్లు …

కార్పొరేట్ సంస్థలు తమ వస్తు సేవలను కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కస్టమర్లకు చేరవేయడంలో అనేక మార్కెటింగ్ వ్యూహాలు పన్నుతాయి. ఉదాహరణకు పండుగ డిస్కౌంట్ సేల్స్ లాంటివి. అలాగే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు కార్పొరేట్ మార్కెటింగ్ విధానాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.

వారి నాయకులను ఒక “బ్రాండ్”గా మలచడం, వారి ఇమేజ్‌ను నిర్మించడం, నినాదాలను ఆకర్షణీయంగా రూపొందించడం జరుగుతోంది. సోషల్ మీడియా, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇతర డిజిటల్ వేదికలు రాజకీయ ప్రచారానికి ప్రధాన ఆయుధాలుగా మారాయి.

ఈ విధానాల్లో నిజమైన ప్రజా సమస్యల కంటే ఆకర్షణీయమైన మాటలు, హామీలు, ప్రచార వ్యూహాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ప్రజలను పౌరులుగా కాకుండా వినియోగదారుల్లా చూడడం జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధమైన ధోరణి.

👉 యజమాని- ఉద్యోగి సంబంధం !

కార్పొరేట్ సంస్థల్లో యజమాని ఉద్యోగి సంబంధం చాలా మార్పులకు లోనవుతూ వస్తున్నది. అనుభవం, నమ్మకం, విశ్వాసం, నిబద్ధత లాంటి విలువలకు కాలం చెల్లింది. ఉద్యోగి ఎంత బిజినెస్ తెస్తాడు అన్నదే ముఖ్యం తప్ప ఎలాంటి మార్గం అవలంభిస్తున్నారు అన్నది ముఖ్యం కాకుండా పోతున్నది.

అదే ధోరణి పార్టీల్లో కి ప్రవేశించింది. నాయకుల అనుభవం, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడడం లాంటివి గుర్తింపబడటం లేదు. ఎన్ని వనరులు సమకూర్చగలరు, ఎన్ని ఓట్లు కొనగలరు లాంటివి ముఖ్యమయ్యాయి. ఒక ఉద్యోగిని లేదా ఒక నాయకుడిని అతని గతంతో కాక రేపు మన పార్టీకి ఉపయోగమా ? లేదా అనే ధోరణి ప్రబలిపోయింది

👉 జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల ప్రయాణం – నాయకులకు ఒక పాఠం …

జగిత్యాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ కురువృద్ధుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ప్రస్తుత పరిస్థితి నేటి రాజకీయ విలువలకు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. నిన్నటి దాకా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా, జగిత్యాలలో తిరుగులేని నాయకుడిగా వెలిగిన ఆయన నేడు తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయాసలు పడుతున్నాడు.

కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఆయన ఎన్నికల్లో పరాజయం పొందడం, తనకు తాను గొప్ప లక్ష్యాలు పెట్టుకోకపోవడం, రాష్ట్ర నాయకుడిగా ఎదిగే అవకాశమున్నప్పుడు వదులుకోవడం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను అంచనా వేయలేక పోవడం, జగిత్యాల, కరీంనగర్ జిల్లా రాజకీయాలకే పరిమితం కావడం, తన కింది నాయకులను ప్రోత్సహిస్తూ తాను పైకి వెళ్ళలేక పోవడం, సాంకేతికతను ఉపయోగించుకోక పోవడం , పార్టీ అవసరాలను గుర్తించకపోవడం, ఆయన వయస్సు, వనరులు  వెరసి అన్నీ ఆయనకు ప్రతికూలంగా మారాయి.

పార్టీ కి ఆయన భవిష్యత్తులో ఉపయోగకారకంగా కనిపించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రత్యర్థిలో తన భవిష్యత్తు వెదుకుకుంటుంది. ఈ పరిణామం విలువలతో కూడినది కాదు.

జీవన్ రెడ్డి ఆవేదన, ఆక్రోశం సబబే.. కాని యుద్ధాల్లో, రాజకీయాల్లో అన్నీ న్యాయమే కదా ! పార్టీలు వ్యక్తులకు పదవులు ఇవ్వడానికో, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికో ఉండవు కదా ! అవి వాటికి, వాటి శీర్ష నాయకత్వానికి ( అగ్ర  నాయకత్వానికి ) మాత్రమే పనిచేస్తాయి. జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇతర నాయకులకు ముఖ్యంగా యువ నేతలకు ఒక పాఠం.

👉 రేవంత్ రెడ్డి ప్రస్థానం లో…

రేవంత్ రెడ్డి  రాజకీయ ప్రస్థానంలో
ఏబీవీపీ, టీ ఆర్ ఎస్, తెలుగు దేశం నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక, జెడ్పిటిసి , ఎమ్మెల్యే, ఎంపీ గా పదవుల అలంకరించి  రాష్ట్రంలో, దేశంలో ప్రతిపక్ష హోదాల కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది కాలానికే టి పీసీసీ ప్రెసిడెంట్, ఆతరువాత  తెలంగాణ ముఖ్య మంత్రి గా కొనసాగుతున్నారు..

2018 లో  ఎమ్మెల్యే ఎన్నికల్లో  టిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి కొడంగల్ లో  ఆయన ఇంటిపై అర్ధరాత్రి పోలీస్ దాడులు  అరెస్టులు,  జైలు జీవితాలు  కేసులు నమోదు,

రేవంత్ రెడ్డిలో కసి, పట్టుదల ఓ లక్ష్యంతో ముందస్తుగానే తాను 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాను అంటూ  తన స్నేహితుల వద్ద పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని శరద్ పవార్  కూతురు సుప్రియ సులేవాల ఎంపీ, ముంబైలో జరిగిన ఎన్సిపి కార్మిక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ప్రాంగణంలో తనతో ముందస్తుగా ” ది ది మై  తెలంగాణ సీఎం అవుతాను అని  అన్నాడు, నాయకుడి  లక్షణాలు, లక్ష్యం అలా ఉండాలి అంటూ ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

రేవంత్ రెడ్డి,  ఉన్నత లక్ష్యం, లక్ష్యానికి అనుకూలంగా పనిచేయడం, రిస్క్ తీసుకోవడం, వయస్సు, వనరులు, అన్నీ కలసి వచ్చాయి. వీటిని యువ నాయకులు గ్రహించాలి. వారికి పాఠ్యాంశం కావాలి..

👉 మంచి-చెడు …

కార్పొరేట్ సంస్కృతిలోని అన్ని అంశాలు పూర్తిగా  మంచివి కావు అని చెప్పలేం. సమర్థత, సమయపాలన, జవాబుదారీతనం , నిర్వహణ నైపుణ్యం వంటి కొన్ని లక్షణాలు రాజకీయ వ్యవస్థను మెరుగుపరచగలవు. కానీ ఈ లక్షణాలు ప్రజాహితాన్ని కేంద్రంగా పెట్టినప్పుడే ఉపయోగకరంగా ఉంటాయి. అధికారమే లక్ష్యంగా మారి పార్టీల సిద్ధాంతాలు మరచినప్పుడు అవే ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతాయి.

రాజకీయ పార్టీలు తమ అసలు లక్ష్యమైన ప్రజాసేవను మరచిపోకుండా ముందుకు సాగాలి. పారదర్శకత, బాధ్యత, సమానత్వం, న్యాయం వంటి విలువలను తమ విధానాలకు కేంద్రంగా చేసుకోవాలి. ప్రజల విశ్వాసమే తమ అసలైన మూలధనం అనే సత్యాన్ని గుర్తించినప్పుడే రాజకీయ వ్యవస్థ సుస్థిరంగా నిలబడుతుంది.