👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ కనుమరుగయ్యే ప్రమాదం నుంచి కాపాడి భవిష్యత్తరాలకు అత్యద్భుతమైన నగరాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

👉 మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట – మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి శనివారం భూమిపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోవు పూజ నిర్వహించి గోశాలను ప్రారంభించారు. శ్రీ మచిలేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.
👉 1400 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని 8 ఎకరాల్లో దాదాపు ₹ 700 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి శంకుస్థాపన చేశారు.
👉 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..

👉 “మూసీ ప్రక్షాళన చేయడమన్నది ఇప్పుడు నిత్యావసర వస్తువులకన్నా అత్యవసరం. పరీవాహక ప్రాంతాన్ని మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా, ప్రత్యేకమైన ధ్యానమందిరాలతో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నాం.
👉 అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఇది మా దీక్ష. మూసీ నది ప్రక్షాళనతో పాటు దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మిస్తాం. రామప్ప ఆలయ నమూనాను ఇక్కడ నిర్మించాలని సంకల్పించాం. ఇది యథాలాపంగా చేస్తున్నది కాదు. దైవేచ్ఛతో సాగుతున్న కార్యక్రమంగా భావిస్తున్నాం. అందరూ ఆశీర్వదించాలి. సహకరించాలి.

👉 చరిత్రను గమనించినప్పుడు నదీ పరీవాహన ప్రాంతాలు, సముద్ర తీరాల్లోని ప్రాంతాలు అభివృద్ధిని సాధించాయి. తెలంగాణ సముద్రతీరం లేని రాష్ట్రం. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, ఈసా నదులున్నా ఆ జలాలను సరిగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయాయి.
👉 దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంతో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఉండే ఢిల్లీలో యమునా నది కాలుష్యమై పారుతోంది. కాలుష్యం కారణంగా సెలవులు ప్రకటించడం, పెట్టుబడులు తరలిపోవడం వంటి పరిస్థితుల నుంచి మనం నేర్చుకోవలసిన అవసరం ఉందా లేదా.
👉 హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. మూసీ ప్రక్షాళనలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన చార్మినార్ మక్కా మసీదు ప్రాంతంలో అద్భుతమైన మసీదును, గౌలిగూడ ప్రాంతంలో సిక్కు చరిత్ర ఉంది. స్వర్ణ దేవాలయంలాంటి దేవాలయం నిర్మాణం, ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చి నిర్మించబోతున్నాం.
👉 వర్షాకాలంలోనే కాకుండా నిరంతర నీటి ప్రవాహం, నగర ప్రజల తాగునీరు, పరిశ్రమల అవసరాలను తీర్చడానికి గోదావరి నుంచి 20 టీఎంసీలను తరలిస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంత ప్రజాప్రతినిధులందరూ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని కోరుతున్నారు. ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ మంత్రివర్గ సహచరుల సహకారంతో ముందుకు వెళుతున్నాం.

👉 ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ప్రాంత ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. కేసును ఉపసంహరించుకోవాలి..” అని కోరారు.
👉 ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ , కాలె యాదయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి , ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు గారు, డీజీపీ శివధర్ రెడ్డి , MRDCL ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
