అంగన్వాడి కేంద్రాలలో  బ్రేక్‌ఫాస్ట్ పథకం !

👉 ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

శాసనసభ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్‌వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం “తొలి ముద్ద”ను ముఖ్యమంత్రి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఇదే సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీని ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ……

“పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. వారి ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టాం. తల్లి గర్భంతో ఉన్నప్పుడు తల్లితో పాటు కడుపులోని శిశువు, అలాగే పుట్టిన తర్వాత పిల్లలకు ఎలాంటి పోషకాహారం అందించాలన్న అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత ఈ కార్యాచరణ చేపట్టాం.

👉 అయితే, ప్రభుత్వం ఎంత మంచి కార్యక్రమం తీసుకొచ్చినా, క్షేత్రస్థాయి సిబ్బంది సరిగా అమలు చేసినప్పుడే దీనికి గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఆ గురుతర బాధ్యత మీదే. ఆకలిని మీరు అమ్మగా అర్థం చేసుకుంటారని, సమస్యల పట్ల మీకు అవగాహన ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

👉 మొదటి 6 సంవత్సరాలు పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అత్యంత కీలక దశ. ఈ సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారం అందించకపోతే ఆశించిన ఎదుగుదల ఉండదు. అందుకని అత్యంత పకడ్బంధీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అత్యంత విలువైన బాల్య దశ మీ చేతుల్లో ఉంది.

👉 దేశంలో జనాభా పోషకాహారం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. చికిత్స కన్నా జబ్బు రాకుండా చర్యలు తీసుకోవాలి.

👉 అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోంది. ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా ముందుగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తాం” అని చెప్పారు.

👉 రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆదేశించారు. అద్దె భవనాల్లో కాకుండా వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని  అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవాల్లో కొనసాగేలా కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు.   

👉 ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ ,  బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌ సీతా దయాకర్ రెడ్డి తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, పలు అంగన్‌వాడీ టీచర్లు, పలువురు పిల్లలు పాల్గొన్నారు.