అంగన్వాడిలో పోషణ సఖి పేరుతో నియామకానికి కసరత్తు ?

👉 ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్  శాసన మండలి హాల్‌లో ముఖ్యమంత్రి తో సమావేశం !

J. SURENDER KUMAR,

అంగన్‌వాడీల్లో కార్యకర్తలు, ఆయాలతో పాటు పోషకాహారం అందించేందుకు అదనంగా మరొకరిని నియమించాలని కార్తీక్ మురళీధరన్  సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందించేందుకు “పోషణ సఖి” పేరుతో మరొకరిని నియమించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


👉 రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  తెలిపారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ రాష్ట్ర శాసన మండలి హాల్‌లో ముఖ్యమంత్రి తో గురువారం సమావేశమయ్యారు.


👉 ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 0–10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం, విద్యాభ్యాస స్థాయి సామర్థ్య లోపాలకు సంబంధించిన పలు నివేదికలను కార్తీక్ మురళీధరన్  దృష్టికి తెచ్చారు. చిన్న వయసులో పోషకాహార లోపం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదనను ఆయన వివరించారు. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను సూచించారు.

👉 ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ముఖ్యమంత్రి  తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు వివరించారు.


👉 కార్తీక్ మురళీధరన్  సూచించిన అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి  అధికారులకు సూచించారు. కార్తీక్ మురళీధరన్ తో సమన్వయం చేసుకుని ఈ అంశంపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.