👉 ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ టవర్ , కాచిగూడ లో జగ్జీవన్ భవన్ లు ఏర్పాటు చేస్తాం.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!
J.SURENDER KUMAR,
మాదిగ సమాజానికి దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న న్యాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో చారిత్రాత్మిక న్యాయం జరగడంతో పాటు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి జరిగిన అభినందన సభ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రసంగించారు
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రసంగంలో..
వర్గీకరణ చట్టం అమలు ద్వారా మాదిగ సమాజానికి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమైందన్నారు.
👉 మాదిగ జాతికి న్యాయం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేలంతా కలిసి వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
👉 ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్రంలోని 33 జిల్లాల ఉద్యోగులు ముఖ్యమంత్రికి అభినందనలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.
👉 సామాజిక న్యాయం సాధనలో మంత్రి దామోదర రాజనర్సింహా తమకు పెద్దన్నలా మార్గనిర్దేశనం చేస్తున్నారని తెలిపారు. తాము పంచపాండవుల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వీరేశం, శామ్యూల్, కంబంపల్లి సత్య నారాయణ,, లక్ష్మీకాంతం కలిసి పనిచేస్తున్నామని అన్నారు.
👉 తమలో ఎవరికి అవకాశం వచ్చినా మాదిగ జాతికి మేలు జరిగేలా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామని, అందరం ఒక్క తాటిపైకి వచ్చి పోరాడతామని స్పష్టం చేశారు.
👉 తాను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగానని మంత్రి గుర్తుచేసుకున్నారు. తన తండ్రి హరిజనవాడలో జన్మించి గుమాస్తాగా పనిచేశారని, ఆరుగురు సంతానంలో తాను ఒకడినని చెప్పారు. ఒకటో తేదీన జీతం వస్తేనే ఇంట్లో పూట గడిచే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.
👉 అలాంటి పరిస్థితుల్లో పెరిగిన తనలాంటి సామాన్య వ్యక్తిని, కాంగ్రెస్ కార్యకర్తను కేబినెట్‌లో కూర్చోబెట్టినది కాంగ్రెస్ పార్టీ విశాలత అని అన్నారు.
👉 వర్గీకరణ చట్టం అమలు కోసం ఎన్నో ఏండ్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి అనేక నెలలపాటు ప్రజల అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. వర్గీకరణ ఫలాలు అందరికీ సమానంగా అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
👉 ఇప్పటికే వర్గీకరణ ఫలితంగా 772 మందికి డాక్టర్లు, ఇంజినీర్లుగా అవకాశాలు లభించాయని వెల్లడించారు. గ్రూప్–2లో సుమారు 16 వేల మందికి, గ్రూప్–3లో దాదాపు 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయని తెలిపారు.
👉 తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. తన స్వగ్రామం పెద్దపల్లిలో ఒకప్పుడు దొరగడి ఉండేదని, తన నాయనమ్మతో కలిసి అక్కడికి వెళ్లినప్పుడు కొట్టంలోనే అన్నం పెట్టేవారని చెప్పారు. దొరలు తినే దగ్గర తినొద్దని తన నాయనమ్మ చెప్పిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ, అలాంటి అవమానాలు చూసిన వ్యక్తిగా ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.

👉 తాను జీవితంలో ఒకటే పార్టీ, ఒకటే జెండాను నమ్ముకున్నానని మంత్రి అన్నారు. మాదిగ జాతికి చెందిన తన రక్త బంధువులు ఎంతో కష్టపడి అధికారుల అనుమతులు తీసుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలవాలని, ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
👉 మాదిగ సమాజం మాట ఇస్తే ప్రాణం వదులుకున్నా మాట తప్పదని, కృతజ్ఞత, అభిమానం, వ్యక్తిత్వం కలిగిన కులం మనదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందితో భారీ అభినందన సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
👉 అంబేద్కర్ స్ఫూర్తితో సమాజాభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అంబేద్కర్ టవర్ పేరుతో భారీ భవనాలు నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ లోయర్ ట్యాంక్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ శిథిలావస్థలో ఉందని, అక్కడ కనీసం విద్యుత్ కూడా లేని పరిస్థితి ఉందని విమర్శించారు. ఆ భవనానికి వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించానని తెలిపారు.
👉 నింబోలి అడ్డ హాస్టల్ రాష్ట్రానికి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఉన్నతాధికారులను అందించిందని మంత్రి గుర్తుచేశారు. నింబోలి అడ్డలోని అంబేద్కర్ భవన్‌ను, అలాగే కాచిగూడలో బాబు జగ్జీవన్ రాం పేరుతో ఉన్న హాస్టల్‌ను పునర్నిర్మిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు.
