👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల సమీకరణతో పాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు.
👉 ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం అందించిన సంస్థల ప్రతినిధులను అభినందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ అభినందన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
👉 శాసనమండలి సమావేశ హాలులో ముఖ్యమంత్రి సీఎస్ఆర్ నిధులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎస్ఆర్ ద్వారా చేపట్టేందుకు వీలున్న కార్యక్రమాల వివరాలన్నీ సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్రస్థాయి సెల్ నిర్వర్తిస్తుందని తెలిపారు.
👉 ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని ఆదేశించారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ విరాళాలను ఇచ్చేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలన్నీ పోర్టల్ లో పొందుపరచాలన్నారు.
👉 కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు, తమకు అనువైన ప్రాజెక్టులను ఎంచుకునేందుకు వీలుగా ఈ పోర్టల్ ఆకర్షణీయంగా తయారు చేయాలని చెప్పారు. జాతీయ స్థాయిలో సీఎస్ఆర్ నిధుల వాటా మన రాష్ట్రంలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని అధికారులు ముఖ్యమంత్రికీ నివేదించారు.
👉 ఇప్పటి వరకు వచ్చిన సీఎస్ఆర్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో లేవని, తెలంగాణలో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి సీఎస్ఆర్ నిధులను వేరే చోట ఖర్చు పెడితే ఎలా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ నిధులు రావాల్సిన అవసరం ఉందని, మన రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు తెలంగాణలోనే ఎక్కువ సీఎస్ఆర్ ఖర్చు పెట్టేలా చూడాలన్నారు.
👉 ఇతర రాష్ట్రాల్లో సీఎస్ఆర్ సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ వాటాను పెంచుకునేందుకు వీలుగా కొత్త పాలసీ ఉండాలని, కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే విధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
