👉 ప్రీ–బడ్జెట్ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సమస్యలు వివరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సంక్షేమ వసతి గృహ భవనాలను వేగంగా పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 80 శాతం పూర్తయిన సంక్షేమ వసతి గృహ భవనాలను యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల్లో పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
👉 హైదరాబాదులో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో శనివారం నిర్వహించిన ప్రీ–బడ్జెట్ సమీక్ష సమావేశంలో, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వివరించిన వివిధ సమస్యలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
👉 సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కార్పొరేషన్లు, అలాగే దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లు, సీనియర్ సిటిజన్లకు సంబంధించిన పథకాల అమలులో ఉన్న సమస్యలను మంత్రి లక్ష్మణ్ విపులంగా వివరించారు. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనాల పూర్తి, మరమ్మతులు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, బిల్లుల చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచనల మేరకు స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, 80 శాతం పూర్తయిన వసతి గృహ భవనాలను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరానికి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే వసతి గృహాల మరమ్మతులకు సంబంధించిన బిల్లులను ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్థిక శాఖకు పంపించి క్లియర్ చేసే విధంగా ఒక ప్రత్యేక సీనియర్ అధికారిని నియమించాలని సూచించారు.
👉 ఈ వేసవికాలంలోనే వసతి గృహాల మరమ్మతు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని, విద్యార్థుల సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
👉 వసతి గృహాలకు సంబంధించిన అద్దెలు, విద్యుత్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు వంటి చెల్లింపులు ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లించేలా సంక్షేమ శాఖ అధికారులు బిల్లులను సకాలంలో ఆర్థిక శాఖకు పంపించాలని సూచించారు. గత ప్రభుత్వ కాలంలో ఈ బిల్లులు ఏడు నెలలకు ఒకసారి చెల్లించేవారని ఆయన గుర్తు చేశారు.
👉 వసతి గృహాలకు సరఫరా చేస్తున్న వస్తువుల నాణ్యతపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని, అందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షించాలని అధికారులకు సూచించారు.

👉 ప్రభుత్వం ఇప్పటికే డైట్ చార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచిందని గుర్తుచేసిన డిప్యూటీ సీఎం, వసతి గృహాల్లో భోజనం, బోధన, ఇతర సదుపాయాలపై అధికారులు తరచూ తనిఖీలు చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
👉 ఈ సమావేశాల్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు సభ్య సాచి గోష్, కృష్ణ ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.
👉 సంక్షేమ శాఖకు సంబంధించిన పెండింగ్ సమస్యలను బడ్జెట్‌కు అనుసంధానంగా ముందుకు తెచ్చి పరిష్కారం దిశగా అడుగులు వేయడంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కీలక పాత్ర పోషించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయన ప్రస్తావించిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రాధాన్య క్రమంలో నిధులు విడుదల చేసేందుకు అంగీకరించడం సమావేశంలో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది
