దళిత గిరిజన అభివృద్ధికి మా ప్రభుత్వ బడ్జెట్‌ దిశానిర్దేశం !

👉 ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ₹.19,721 కోట్లు కేటాయింపు !

👉 దివ్యాంగుల వివాహాలకు ₹ 2 లక్షల నగదు ప్రోత్సాహకం !

👉 అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద…

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి దూరదృష్టి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమర్థ నాయకత్వంలో రూపొందించిన 2026-27 బడ్జెట్‌ సమగ్రాభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు..

ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించిన సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యాలను ప్రతిబింబించే బడ్జెట్‌ అని అసెంబ్లీ ఆవరణలోనిమీడియా పాయింట్ వద్ద మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.

👉 షెడ్యూల్డ్ కులాలకు ₹11,784 కోట్లు, షెడ్యూల్డ్ తెగలకు ₹ 7,935 కోట్లు కలిపి మొత్తం ₹19,721 కోట్ల భారీ కేటాయింపులు చేయడం ద్వారా అట్టడుగు వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

👉 హైదరాబాద్‌లో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఆధునిక సదుపాయాలతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణం చేపడుతున్నామని, అలాగే కాచిగూడ మౌళి అడ్డ వద్ద బాబు జగ్జీవన్ రామ్ కళాశాల విద్యార్థి వసతి భవన్ ను  అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాల్లో దళిత విద్యార్థులకు అత్యున్నత స్థాయి కోచింగ్ అందించి సివిల్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.

👉 రాష్ట్రవ్యాప్తంగా దళిత సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి ₹ 368 కోట్ల 27 లక్షల వ్యయంతో 910 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, అంబేద్కర్ భవనాలు, విగ్రహాలు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు.

👉 సంక్షేమంలో భాగంగా దివ్యాంగుల వివాహాలను ప్రోత్సహిస్తూ ₹ 2 లక్షల నగదు కానుక అందించడం ప్రభుత్వం సామాజిక బాధ్యతను చాటుతున్నదని అన్నారు.

👉 ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రూపకల్పన చేసి ₹ 4,000 కోట్లు ప్రతిపాదించడం ఈ బడ్జెట్ ప్రత్యేకతగా పేర్కొన్నారు. అలాగే చేయూత పథకం కింద అర్హులైన వారికి 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ ₹ 14,861 కోట్లు కేటాయించడం ప్రజల జీవన భద్రతకు పెద్ద అడుగని తెలిపారు.

👉 విద్య రంగంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ₹ 500 కోట్లు ప్రతిపాదించామని చెప్పారు. విద్యార్థుల పోషణ కోసం కొత్తగా అల్పాహారం పథకాన్ని ప్రవేశపెట్టి, వారానికి మూడు రోజులు పాలు, మిగతా రోజులు రాగి జావ అందించేందుకు ₹ 800 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.

👉 ఆరోగ్య రంగంలో 23.50 లక్షల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం ప్రవేశపెట్టడం గొప్ప ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు.

👉 ఉద్యోగులు, పెన్షనర్ల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రమాద బీమా పథకం కింద ప్రమాద మరణం సంభవించినట్లయితే ₹.1.20 కోట్లు, టర్మ్ ఇన్సూరెన్స్ కింద ₹ 10 లక్షలు, విమాన ప్రమాదంలో అదనంగా ₹2 కోట్ల కవరేజ్ లభించేలా రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా 7.57 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ రెండు పథకాల కోసం ₹ 1,056 కోట్లు ప్రతిపాదించామని వెల్లడించారు.

👉 గత ప్రభుత్వ కాలంలో అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారని మంత్రి కొనియాడారు.

👉“ఈ బడ్జెట్‌ కేవలం లెక్కల పత్రం కాదు… ఇది సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సంక్షేమం కలగలిపిన అభివృద్ధి దిశగా తెలంగాణను ముందుకు నడిపించే కార్యాచరణ ప్రణాళిక” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.