దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎందుకు మాట్లాడలేదు !

👉 శాసనసభలో హరీష్ రావు పై  ధ్వజమెత్తిన  మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో ఇసుక, గ్రానైట్ అక్రమాలపై విచారణ చేపట్టాలి !

J.SURENDER KUMAR,

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేరెళ్ల గ్రామంలో ఇసుక లారీ ఢీకొని దళిత బాలిక మృతి చెందితే దళితులు లారీలను అడ్డుకోవడానికి ధర్నా చేస్తే నేరెళ్ల లో దళిత యువకులపై ఆనాటి ప్రభుత్వం థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే , మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు అని అసెంబ్లీలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హరీష్ రావు పై ధ్వజమెత్తారు.

అసెంబ్లీలో శనివారం మైనింగ్ పై జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రాఘవా కన్స్ట్రక్షన్ పై  ఆరోపణలు చేయడంతో పాటు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రస్తావించారు.

👉 ఈ అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

కేటీఆర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిపాలనలో ఇసుక లారీలను అడ్డుకున్న నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారని పరామర్శించడానికి తాను, మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళితే ఈ బాధ భరించలేమని మాకు విషమిచ్చి చంపండి అని ఆనాడు వారు వేడుకున్నారని మంత్రి  సభలో వివరించారు.

మైనింగ్ పై జరిగిన చర్చలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు హరీష్ రావు ప్రస్తావించడాన్ని మంత్రి  లక్ష్మణ్ కుమార్ తప్పు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దళితులపై ఇసుక మాఫియా దాడులు చేస్తే హరీష్ రావు కనీసం నోరు ఇవ్వలేదని మంత్రి  లక్ష్మణ్ కుమార్ ధ్వజమెత్తారు.

పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన ఇసుక తవ్వకాలపై విచారణ చేయడంతో పాటు మైనింగ్ అక్రమాలతో పాటు కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ అక్రమాలు విచారణ జరిపి సభ ముందు పెడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సభలో పేర్కొన్నారు.