దుబాయి ఆసుపత్రి లో  జగిత్యాల జిల్లా వాసి !

👉 సహాయం కోసం, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ద్వారా సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన కుటుంబం !

👉 53 వేల యూఏఈ ధరమ్స్ ( ₹13 లక్షలు) హాస్పిటల్ బిల్లు మాఫీ చేయాలని, పెషేంట్ ను భారత్ కు తరలించాలని విజ్ఞప్తి !

J.SURENDER KUMAR,

ఉపాధి కోసం యూఏఈ దేశంలోని దుబాయికి వెళ్లిన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్ పల్లి కి చెందిన కొండ్ర రాజేష్ ను అనారోగ్యం రూపంలో దురదృష్టం వెంటాడింది. సోరియాసిస్ చికిత్స కోసం ఫిబ్రవరి 27న దుబాయి లోని ‘ఆస్టర్ హాస్పిటల్’ లో చేరి కోమా (ఆపస్మారక స్థితి) లో ఉన్నాడు. మార్చి 3 నాటికి ఆసుపత్రి బిల్లు 52,950 యూఏఈ ధరమ్స్  ( ₹13,23,383) కు చేరుకుంది.

పెషేంట్ కొండ్ర రాజేష్ కుటుంబ సభ్యులు, తలారి రాజేష్ ద్వారా మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని జగిత్యాలలో కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. స్పందించిన జీవన్ రెడ్డి వెంటనే ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి తో మాట్లాడి పెషేంట్ కు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ మేరకు, పెషేంట్ రాజేష్ భార్య అనూష శుక్రవారం హైదరాబాద్ లోని సీఎం ప్రవాసీ ప్రజావాణి కి దరఖాస్తు పంపారు. ఆసుపత్రి బిల్లు చెల్లించే ఆర్థిక స్థోమత తమ  కుటుంబానికి లేదని, ఆసుపత్రి బిల్లును మాఫీ చేయడం తో పాటు, తన భర్తను దుబాయి నుంచి హైదరాబాద్ కు పంపాలని ఆమె కోరారు.

సీఎం ప్రవాసీ ప్రజావాణి వాలంటీర్ భార్గవి నద్దునూరి పెషేంట్ భార్య అనూష తో, దుబాయి లో ఉన్న పెషేంట్ సోదరుడు రమేష్ తో, దుబాయి లోని సామాజిక సేవకులు గుండెల్లి నర్సింలు తో, తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై విభాగంతో సమన్వయం చేశారు. ‘మదద్’  పోర్టల్ ద్వారా దుబాయి లోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లారు. ఇదే విషయాన్ని అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ (ఏడిఎఫ్) సంస్థ వారు కూడా ‘మదద్’ పోర్టల్ లో అప్లోడ్ చేశారు.