👉 తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్ లో
J SURENDER KUMAR,
సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్‌బీ స్టేడియం మళ్లీ క్రీడాస్ఫూర్తికి వేదికగా ప్రజాప్రతినిధుల సందడితో కోలాహళంగా మారింది. నాయకులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందన్న సందేశంతో “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్” క్రీడలు ఆద్యంతం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.
👉 బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించే శాసనమండలి, శాసనసభ సభ్యులకు 14 సంవత్సరాలుగా నిలిచిపోయిన క్రీడా సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ప్రారంభించారు. ప్రారంభించడమే కాకుండా సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు క్రీడల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని కలిగించారు.

👉 శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర క్రీడాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..
👉 “ఎల్బీ స్టేడియంకు గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలోనే పేరుగాంచిన క్రీడాకారులు ఈ మైదానంలో ఆడటమే కాకుండా శిక్షణ పొందారు. ఈ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం. అలాగే గచ్చీబౌలిలో ఉన్న క్రీడా మైదానాలను ₹700 కోట్ల రూపాయలతో ప్రపంచస్థాయి క్రీడా వసతులతో అభివృద్ధి చేస్తాం.
👉 గచ్చీబౌలీలో 2034 ఒలింపిక్స్ నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. 3 నెలల్లో అక్కడ పనులను ప్రారంభించబోతున్నాం. వచ్చే మూడేళ్లలో క్రీడలన్నింటినీ గచ్చీబౌలి క్రీడా మైదానాల్లో నిర్వహించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. బేగంపేట హాకీ మైదానాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.
👉 1950-60 దశకంలో మొట్టమొదటిసారి ఫుట్ బాల్ లో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఆనాడు 7 మంది క్రీడాకారులు హైదరాబాద్ నగరానికి చెందినవారే ప్రాతినిథ్యం వహించారు. ఒకప్పుడు హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్ మన రాష్ట్రానికి నగరానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. ఇప్పుడు క్రీడల్లో వెనకబడ్డాం. యువతీయువకుల్లో క్రీడాస్ఫూర్తిని కలిగిస్తూ క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతోంది.

👉 తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలు పూర్తిగా కనుమరుగయ్యాయి. మంచి పాలన అందించాలంటే ప్రభుత్వానికి విధివిధానాలు ఉండాలి. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడా పాలసీని తీసుకొచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలను వెలికితీయాలని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను నిర్వహించాం.
👉 140 కోట్ల జనాభా కలిగి ఉన్నప్పటికీ దేశం నుంచి ఎంట్రీ స్థాయిలో కూడా క్వాలిఫై కాలేకపోతున్నాం. ఒలింపిక్స్‌లో సౌత్ కొరియా 30 స్వర్ణ పతకాలు సాధిస్తే, అందులో 16 గోల్డ్ మెడల్స్ అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీ దక్కించుకుంది. దక్షిణ కొరియాకు ఉన్న పట్టుదల మనకు లేకపోవడం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
👉 క్రీడాస్పూర్తిని పెంచాలన్న ఉద్దేశంతోనే ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గడం మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించాం. క్రీడల్లో రాణించే విద్యార్థినీ విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుంది. క్రీడలపైన ఆసక్తి పెంచుకోవాలి. రాణించాలి..” అని ముఖ్యమంత్రి చెప్పారు.
