గణపతి ఎక్కడ ? లొంగుబాటు లొల్లి ఇక్కడ !

👉 ఆరు సంవత్సరాల క్రితం గణపతి నీ చూశాను  తిప్పరి తిరుపతి @ దేవ్ జి..!

J.SURENDER KUMAR

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్ పర్సన్, మావోయిస్టు పార్టీ  సిద్ధాంతకర్త, ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు @ గణపతి రేపో మాపో, తెలంగాణ పోలీసులకు లొంగిపోతాడని లేదా, కేంద్ర ప్రభుత్వానికి లొంగుతాడని ప్రచార సాధనాలు ఉదరగొడుతున్నాయి.. గణపతి ఎక్కడున్నాడో ? తెలియదు కానీ, ఇక్కడి ప్రచార సాధనాలలో లొల్లి మొదలైంది..

ఇటీవల ప్రభుత్వానికి సరెండర్ అయినా, లేదా? అరెస్టు కాబడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పరి తిరుపతి @ దేవుజీ.  ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 2003లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ముప్పాల లక్ష్మణరావు @  గణపతిని చూశాను అని కొన్ని రోజుల క్రితం అన్నారు.తాము సరెండర్ కాలేదని, అరెస్టు అయ్యానని కూడా దేవుజీ స్పష్టం చేశారు.

👉  ఫోటోలతో సహా అజ్ఞాతంలోకి…

గణపతి ప్రాథమిక విద్య కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం, గంగిపల్లిలో జరిగింది. వరంగల్ లో ఉపాధ్యాయ ట్రైనింగ్  (BEd) చేస్తూ అజ్ఞాతంలోకి వెళ్లిన గణపతి తన, తన కుటుంబ సభ్యులు ఫోటోలను, మాయం చేశారని గణపతి సమీప బంధువు ప్రముఖ కాంట్రాక్టర్ చంద్రశేఖర రావు తెలిపారు.

👉 35 సంవత్సరాల తర్వాత టీవీ ఛానల్ లో గణపతి !

1970-72 లో  అజ్ఞాత బాట పట్టిన ముప్పల లక్ష్మణరావు మూడున్నర దశాబ్దాల తర్వాత టీవీ ఛానల్ లో గణపతి దళాలను  ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న వీడియోలు, ప్రసార మాధ్యమాలలో అగుపించాయి.

65 సంవత్సరాల పైబడిన బీర్పూర్ గ్రామస్తులకు గాని అతని బంధు వర్గం గాని గణపతినీ గుర్తుపట్టగలుగుతారు. 65 సంవత్సరాలు లోపు వయస్సు వారికి గణపతి ని గుర్తుపట్టలేరు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ హత్య కేసులలో1977 ఆగస్టు మాసంలో నిజాంబాద్ జిల్లాలో మెట్పల్లి పోలీసులు అరెస్టు అరెస్టు చేశారు..

బెయిల్ పై బయటికి వచ్చి గణపతి అజ్ఞాతం లోకి వెళ్లాడు. మూడున్నర దశాబ్దాల తర్వాత ‘ ఓపెన్ మ్యాగజిన్’ టీవీ ఛానల్ జర్నలిస్ట్ ‘రాహుల్ పండిత్ ‘( హలో బస్తర్  రచయిత )కు గణపతి 2009 -10  అక్టోబర్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ మరియు గణపతి దళాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియోలు అక్టోబర్ 24న  IANS ఛానల్లో ప్రసారమయింది.

ఈ వీడియోలను వివిధ ఎలక్ట్రానిక్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానల్ లు, జాతీయ, అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేశారు. దీంతో గణపతి రూపం ఇలా ఉన్నది అనే విషయం పోలీస్, రక్షణ దళాలకు, స్వగ్రామం బీర్పూర్ ప్రజలకు, పత్రికలకు ప్రచార మాధ్యమాలకు తెలిశాయి ఈరోజు వరకు ఆ ఫోటోలే ప్రచారం మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి..

👉 తెలంగాణ పోలీసులకు కాంటాక్ట్ లో ఉంటే..?

మావోయిస్టు అగ్ర నాయకులతో పాటు,  కేంద్ర కమిటీ, పొలిటి బ్యూరో సభ్యులు, గణపతి తో దశాబ్దాలుగా సహచరులుగా కొనసాగిన పలువురు  తెలంగాణ, మహారాష్ట్ర ,చత్తీస్గడ్, తదితర రాష్ట్ర ప్రభుత్వాలకు లొంగిపోయిన వారికి గణపతి ఆచూకీ స్థావరం కదలికల సమాచారం, నిఘ వర్గాలకు, ప్రభుత్వాలకు సమాచారం తెలియకపోవడం ప్రత్యేకత..

దశాబ్దాలుగా తండ్రితో ఎలాంటి సంబంధం లేని గణపతి తనయుడు వాసుదేవరావు, వాయిస్ మెసేజ్ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా  ప్రచార సాధనాలు చెక్కర్లు కొట్టడంలో ఆంతర్యం ఏమిటో ? అంతు చిక్కని చిదంబర రహస్యం.

👉 ఎన్కౌంటర్ల పై నోరు మెదపని గణపతి !

ఛత్తీస్‌గఢ్‌లో గత సంవత్సరం మే లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి,, పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్‌ సభ్యుడు నంబాల కేశవరావు మృతిచెందారు. ఆయనతోసహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు . వారిలో ‘అవామ్‌-ఐ-జంగ్‌’ ఎడిటర్‌, 31 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నేత, మాడ్‌ ఏరియా డివిజన్‌ ప్రెస్‌ యూనిట్‌ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు సజ్జా వెంకట నాగేశ్వరరావు @ రాజన్న @ యేసన్న @ నవీన్‌ సైతం మృతి చెందినవారిలో ఉన్నారు.

.గత సంవత్సరం నవంబర్ లో ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకుడు హిడ్మా, అతని భార్య మద్కం రాజే, మరో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్లపై గణపతి పత్రికా ప్రకటనలో ఖండించకపోవడం ప్రస్తవహనారం.

👉 సీతారామయ్య స్థానంలో గణపతి !

1992 లో పీపుల్స్ వార్ వ్యవస్థాపక అధినేత కొండపల్లి సీతారామయ్యను 1992 లో ఆ బాధ్యతల నుంచి తప్పించి (బహిష్కరించారు అనుకోవచ్చు)   కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన గణపతి 2004 లో బీహార్ మావోయిస్టు పార్టీతో కలసి సిపిఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీ గా నామకరణం చేసుకున్న పార్టీకి 2017 వరకు గణపతి సుప్రీం చీఫ్ గా కార్యకలాపాలు నిర్వహించాడు. దేశవ్యాప్తంగా దాదాపు 157 జిల్లాలకు విస్తరించింది,.

2017 లో సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు@ బసవరాజుకు బాధ్యతలు అప్పగించిన తరువాత గణపతి కదలికలు, దళాలను ఉద్దేశించి ప్రసంగాలు, పత్రికా ప్రకటనలు,  గణపతి పేరుతో కానీ, గణపతి గూర్చి కానీ ఆ పార్టీ పలు సందర్భాలలో మీడియాకు విడుదల చేసిన  ప్రకటనలలో  పేర్కొనలేదు.. 2020 లో గణపతి కొంతమంది కీలక నాయకులతో నాటి కెసిఆర్ ప్రభుత్వం ముందు లొంగిపోతాడని ప్రచార సాధనాలలో విస్తృతంగా ప్రచారం జరిగింది.  ఈ ప్రచారంను ఆ పార్టీ పత్రికా ప్రకటనలో ఖండించింది.

👉 గణపతి లొంగుబాటును సమాజం ఆహ్వానిస్తున్నది !

పైబడిన వయస్సు, అనారోగ్య సమస్యలు, కీలక కేంద్ర కమిటీ , పొలిటి బ్యూరో నాయకులు,  దళాలకు దళాలు,  వందలాదిమంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాలు, ఆయుధాలతో సహా లొంగుబాటులు, దండకారణ్యంలో ఎన్కౌంటర్లు, కొనసాగుతున్న కంగారు ఆపరేషన్, భద్రత దళాలు దండకారణ్యంలో ఫారెస్ట్ బ్లాక్ విధానం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షం నుంచి అనుక్షణం గాలింపులతో మావోయిస్టులు తమ స్థావరాలనుంచి బయటకు కాలు పెట్టలేని దుస్థితి, దీనికి తోడు రహస్య స్థావరాలకు నిత్యవసర సరుకులు , మందులు అందలేని దుస్థితి దండకారణ్యంలో నెలకొంది..

గణపతి పట్ల సిద్ధాంతకర్తగా, మేధావిగా, ఆశయ సాధనలో ఉద్యోగం, భార్యా పిల్లలను, కుటుంబ సభ్యులను బలమైన సామాజిక వర్గాన్ని కాదని దాదాపు ఐదు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న గణపతి పట్ల  అన్ని వర్గాలలో ఆదరణ, అభిమానం ఉందనేది జగమెరిగిన సత్యం. గణపతిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి లొంగిపోవాలని సమాజం ముక్తకంఠంతో కోరుతున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి  సైతం గణపతి లొంగి పోవాల్సిందిగా బహిరంగ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే..

2026 మార్చి 31 మావోయిస్టు రహిత దేశంగా చేస్తానని హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో, బయట బహిరంగ గా చేసిన ప్రకటనకు మరో 15 రోజుల సమయం ఉంది ఈ గడువులో గణపతి లొంగుతాడో ? లేదో ? వేచి చూడాల్సిందే..