గణపతి లొంగిపో నీకు వైద్యం అందిస్తాం!

👉హింసను వీడండి జనజీవన స్రవంతిలోకి రండి !

👉 డీజీపీ బి. శివధర్ రెడ్డి, మావోయిస్టులకు విజ్ఞప్తి !

J SURENDER KUMAR,

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ అగ్ర నేత సెంట్రల్ కమిటీ సభ్యుడు గణపతికి హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మావోయిస్టు పార్టీకి చెందిన అజ్ఞాత నాయకులు, సభ్యులు హింసను వీడి  ఆయుధాలను వదిలి, ప్రజాస్వామ్య జనజీవన స్రవంతిలోకి రావాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి మావోయిస్టులకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

మార్చి 7న 130 మంది మావోయిస్టులు లొంగిపోయిన సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగత విజ్ఞప్తిని కూడా డిజిపి శివధర్ రెడ్డి
గుర్తు చేశారు. సురక్షితంగా, గౌరవప్రదమైన జీవితం గడపాలని ఆయన కోరారు.ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన పూర్వపు పిలుపును గుర్తు చేస్తూ, అండర్‌గ్రౌండ్ జీవితం నుంచి బయటకు వచ్చి, కుటుంబ సభ్యుల వద్దకు చేరి, సమాజంలో ప్రశాంత జీవితం గడపాలని డీజీపీ సూచించారు.

గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ పోలీసుల నిరంతర కృషి ఫలితంగా తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వివిధ స్థాయిల్లోని మొత్తం 721 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరారని డీజీపీ తెలిపారు. వీరిలో 4 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 19 మంది స్టేట్ కమిటీ సభ్యులు, 36 మంది డివిజనల్ కమిటీ సభ్యులు (DVCMs) ఉన్నారని వెల్లడించారు.

లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస విధానం కింద ఆర్థిక సహాయం మరియు ఇతర సదుపాయాలు అందించబడుతున్నాయని, వీటి ద్వారా వారు తమ స్వగ్రామాల్లో గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారని తెలిపారు.

👉 ఇతర రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగుతున్న తెలంగాణకు చెందిన నాయకులు

👉 ముప్పల లక్ష్మణరావు @  గణపతి !

👉 పసునూరి నరహరి @ సంతోష్ !

👉 వార్త శేఖర్ @ మంగ్తు !

👉 జోడే రత్నబాయి @ సుజాత !

👉 నక్క సుశీల @ రేలా !

👉 రంగబోయిన భాగ్య @  రూపి !

అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలసి  పునరావాస పథకాన్ని ఉపయోగించుకోవాలని డిజిపి  ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర పునరావాస విధానంపై నమ్మకం పెరుగుతున్న నేపథ్యంలో, ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు కూడా లొంగిపోవడానికి ఆసక్తి చూపుతున్నారని డిజిపి తెలిపారు.

అజ్ఞాతవాసంలో  ఉన్నవారి కుటుంబ సభ్యులు, బంధువులు వారికి సలహా ఇచ్చి, శాంతియుత మార్గం వైపు నడిపించాలని కోరారు.
ప్రస్తుత పరిస్థితుల్లో శాశ్వత పరిష్కారాలు ప్రజాస్వామ్య మార్గాల ద్వారానే సాధ్యమని పునరుద్ఘాటిస్తూ, మావోయిస్టు సభ్యులు హింసను విడిచి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ బి. శివధర్ రెడ్డి మరోసారి పిలుపునిచ్చారు.