J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ మంత్రి తో బుధవారం భేటీ అయ్యారు.
👉 రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని తెలిపారు.
👉 దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనర్, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని వివరించారు.
👉 మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచి కేటాయించాలని కోరారు.
👉 ఈ భేటీ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాతో చర్చించారు. ఇటీవల మావోయిస్టు అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం అంశాలు చర్చించారు. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు.
👉 రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు.
👉 రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కూడా కోరారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి , రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి , ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ , ఎస్‌ఐబి ఐజీపీ బి. సుమతి పాల్గొన్నారు.
