హైదరాబాద్ అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను రూపొందించాం !

👉 శాసనమండలి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు చేపట్టడం వంటి బృహత్తరమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్ లోపలి కోర్ అర్బన్ ప్రాంత పరిపాలన మొత్తం ఒక గొడుగు కిందకు తెచ్చి హైదరాబాద్ నగర అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించామని చెప్పారు.

👉 శాసనమండలి సభ్యులు లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి గారు.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మెట్రో, రోడ్ల విస్తరణపై సమగ్రంగా వివరించారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లక్ష్యంతో 24 వేల కోట్ల రూపాయలతో మెట్రో రెండో దశ 76 కిలమీటర్ల మేరకు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు.


👉 “మూసీ సుందరీకరణతో పాటు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించుకోవడం వల్ల హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్లను 3 రకాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు తీసుకున్నాం, అండర్ పాస్, సర్ఫేస్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం.


👉 ఉత్తర తెలంగాణ మార్గంలో అటు కరీంనగర్, ఇటు మేడ్చెల్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం బాటిల్ నెక్‌గా మారింది. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రక్షణ శాఖ నుంచి 153 ఎకరాలు సేకరించాం. రక్షణ శాఖకు భూమికి బదులుగా భూమి కేటాయించాం.


👉 దేశంలో ఎక్కడా లేని విధంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద నుంచి ఉత్తర తెలంగాణ వైపు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు తొలగించడానికి అండర్ టన్నెల్ నిర్మాణానికి అనుమతి తీసుకున్నాం. పనులు కొనసాగుతున్నాయి.


👉 నల్గొండ వైపు వెళ్లే వారికి బాటిల్ నెక్‌గా మారిన నల్గొండ చౌరస్తా జంక్షన్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ జూన్, జూలై నాటికి అందుబాటులోకి రానుంది.


👉 బాటిల్ నెక్స్‌ను తొలగించి నిరంతర ప్రయాణానికి 29 ప్రాంతాల్లో అండర్ పాస్, సర్ఫేస్ రోడ్స్, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.


👉 బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట చౌరస్తా తదితర ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ రోడ్, ఎమ్మెల్యే కాలనీ, దుర్గం చెరువు, రామానాయుడు స్టూడియో, హైకోర్టు జడ్జెస్ క్వార్టర్స్, మహాప్రస్థానం, కోహినూర్ హోటల్ నుంచి రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి దానిని పీవీ ఎక్స్‌ప్రెస్ వేకు అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.


👉 హైదరాబాద్ మెట్రో ప్రారంభమైనప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, గత దశాబ్దకాలం ఎలాంటి విస్తరణ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో 9వ స్థానంలోకి పడిపోయాం. హైదరాబాద్ నగరానికి ఎక్కడి నుంచి అయితే ట్రాఫిక్ ప్రారంభమయ్యే హయత్‌నగర్, రామచంద్రాపురం లాంటి లాస్ట్‌మైల్ కనెక్టివిటీ ప్రాంతాలకు మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉంది.


👉 మెట్రో పనులను విస్తరించాలని భావించినప్పుడు ఎల్ అండ్ టీ సంస్థ ఈ వ్యాపారం నుంచి తప్పుకున్నామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.


👉 ఎల్బీనగర్ వద్ద మెట్రో ఆగిపోయింది. హైదరాబాద్‌కు ట్రాఫిక్ ప్రారంభమయ్యే హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరించాలి. అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ లేదు. అందుకే నాగోల్, ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయగుట్ట, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు మెట్రోను పొడగిస్తున్నాం.


👉 గౌలిగూడ వద్ద ఆగిపోయిన మెట్రో పనులను పునరుద్ధరించి ఫలక్‌నుమా, చాంద్రాయగుట్ట జంక్షన్‌కు కనెక్ట్ చేస్తున్నాం. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్న పైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్ వరకు పొడగించాల్సి ఉంది.


👉 బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం నుంచి అత్యధిక ట్రాఫిక్ ఉంటుంది. చందానగర్ వరకు, నియోపోలిస్ కనెక్ట్ చేస్తూ విస్తరించాల్సి ఉంది.


👉 నగరంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల కూడా పాదచారులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలేర్పడుతున్నాయి. చిరు వ్యాపారులకు కొంత కష్టమైనప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా ఆపరేషన్ రోప్ పేరుతో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగిస్తున్నాం.


👉 పార్కింగ్ కూడా అతిపెద్ద సమస్యగా మారింది. అందుకే కేబీఆర్ పార్క్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో మల్టిలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశాం.


👉 360 కి.మీ మేరకు విస్తరించి ఉండే రీజినల్ రింగ్ రోడ్డుకు ఓఆర్ఆర్‌కు మధ్యన రేడియల్ రోడ్లను చేపట్టాం.


👉 మూసీ పునరుజ్జీవంలో భాగంగా హిమాయత్ సాగర్ జంక్షన్ నుంచి మూసీ వెంట గౌరవెల్లి వరకు గౌలిగూడ, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్ జంక్షన్లలో ట్రంపెట్లను ఏర్పాటు చేస్తూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తాం. ఈ కారిడార్ వల్ల హిమాయత్‌సాగర్ నుంచి గౌరవెల్లి వరకు 43 కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ కారిడార్‌తో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.


👉 ఈ రకంగా 783 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కోర్ అర్బన్ రీజియన్ CURE ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశాం. పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చెల్ కార్పొరేషన్స్‌ను, 4 పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేశాం..” అని ముఖ్యమంత్రి  వివరించారు.