హైదరాబాద్ లో డిసెంబర్ 9 నాటికి మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌కు తలెత్తకుండా నివారించడంతో పాటు ఈ నగరాన్ని ప్రపంచంలోనే మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో తిరిగే ఆర్టీసీ బస్సులను 2026 డిసెంబర్ 9 నాటికి వంద శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు.


👉 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  మహిళా జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు.


👉 “దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మహిళా జర్నలిస్టులు విశ్లేషించాలి. వర్షాలొస్తే ముంబయ్ అతలాకుతలమవుతోంది. వాయు కాలుష్యంతో ఢిల్లీ సతమతమవుతోంది. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు, వరదలొచ్చినప్పుడు చెన్నైలో ఏర్పడే ప్రమాదకర పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం.


👉 సమీప భవిష్యత్తులో హైదరాబాద్ నివాసయోగ్యం కాని నగరంగా మారే పరిస్థితులు రావొద్దు. ఇలాంటి పరిస్థితులు హైదరాబాద్ నగరానికి తలెత్తకూడదనే ప్రణాళికలు రూపొందించాం. హైదరాబాద్‌లో వాయు నాణ్యత (AQI) ఇప్పటికే ఆరెంజ్ కేటగిరీలోకి చేరింది. మరింత ప్రమాదకంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు తెచ్చుకోవద్దు.


👉 హైదరాబాద్‌లో చెత్త పేరుకుపోతోందని, దోమలు పెరిగాయనో, మూసీలో కాలుష్యం పారుతోందని, నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టకుండా ఎలా సాధ్యం. నదుల్లో కాలుష్య నివారణకు ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యూపీలో గంగా నది ప్రక్షాళన, గుజరాత్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టినట్టే, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఎందుకు చేపట్టొద్దు.


👉 సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు మూసీ నదికి సంబంధించి బఫర్ జోన్ విషయంలో 2012లో నిబంధనలు రూపొందించారు. నాలా అయితే బఫర్ జోన్ ఎంత ఉండాలి, చెరువులైతే ఎంత ఉండాలి, నదులైతే ఎంత ఉండాలన్నది ఖరారు చేశారు. ఆ మేరకు మూసీ నది వెంట నాలా అయితే 10 మీటర్లు, నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.


👉 కాలుష్య కారక మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో నిర్వాసితులకు ప్రభుత్వం సరైన సహాయం అందిస్తుంది. ప్రాజెక్టును అడ్డుకోవడంకన్నా బాధ్యత కలిగిన వారంతా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడం లేదా వారికి మరే ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వంతో చర్చించవచ్చు.


👉 గాంధీ సరోవర్ ప్రాజెక్టు వద్ద ఒక ఆపార్ట్‌మెంట్‌పై ఈ మధ్య చర్చ జరుగుతోంది. 7 ఎకరాల ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌కు అంతే స్థలమిచ్చి, కొత్తగా నిర్మాణానికి అయ్యే ఖర్చును బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పాం. లేదా నష్టపరిహారం తీసుకుని వేరే ప్రాంతంలో కట్టుకుంటామన్నా ఇబ్బంది లేదని ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను సూచించింది.


👉 మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ – 1లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ₹ 5 వేల కోట్లు, ₹10 వేల కోట్లు వెచ్చిస్తున్నారంటూ చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం దాదాపు ₹70 కోట్లు, విజ్ఞాన కేంద్రం, ఆ ప్రాంత అభివృద్ధి మొత్తంగా ₹ 200 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది.


👉 ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రణాళికపై ఈ నెల 13న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం.


👉 కాలుష్య నివారణలో భాగంగా 2026 డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‌లో ఆర్టీసీ ద్వారా వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతాం. ప్రస్తుతం ఆర్టీసీలో 2800 బస్సులు డీజిల్‌తో నడుస్తున్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా వాటి స్థానంలో 500 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాం.


👉 డీజిల్ వాహనాలను ఓఆర్ఆర్ అవతలి ప్రాంతానికి తరలించి వాటి స్థానంలో డిసెంబర్ నాటికి నూరుశాతం ఈవీ బస్సులను ప్రవేశపెడుతాం. ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈవీ వాహనాలకు జీరో పన్ను పాలసీ తెచ్చాం.


👉 నగరంలో 2 లక్షల ఆటోలున్నాయి. డీజిల్, పెట్రోల్ ఇతర ఇంధన ఆధారంగా నడుస్తున్న ఈ ఆటోలను రెట్రోఫిటింగ్ కింద ఈవీలుగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నాం. నగరంలో కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ కేటగిరీలోని పరిశ్రమలను నగరం అవతలి వైపునకు తరలిస్తున్నాం.


👉 దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జీడీపీలో 5 శాతం మేరకు దోహదపడుతున్న నేపథ్యంలో 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యాలను నిర్దేశించాం. 2047 నాటికి దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచి దోహదపడాలి. ఈ లక్ష్యసాధనలో మహిళలు సంపూర్ణంగా సహకరించాలి.


👉 మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసే చోట మహిళలకు రక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేస్తాం. రక్షణ కల్పించడమే కాకుండా ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుంది. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో ఎవరికీ అన్యాయం జరగదు.


👉 మహిళలు ఆర్థికంగా ఎదిగిన కారణంగానే కొన్ని దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా నిలబడ్డాయి. సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షకు ముగింపు పలకాలంటే మహిళల శక్తిని గుర్తించి సమాన అవకాశాలు కల్పించాలి. మహిళల శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదు. కష్టపడే వారికి గుర్తింపునివ్వాల్సిన బాధ్యత అందరిపైనా, ప్రభుత్వాలపైనా ఉంది.


👉 దేశంలో అగ్రస్థానంలో తెలంగాణను నిలపాలన్న లక్ష్య సాధనలో మహిళా జర్నలిస్టుల సహకారం ఉండాలి. మహిళలకు ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చుకుందాం..” అని అన్నారు.


👉 ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ , మహమ్మద్ అజహరుద్దీన్ , మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక తో పాటు మహిళా జర్నలిస్టులు పెద్దఎత్తున పాల్గొన్నారు.