J.SURENDER KUMAR,
దేశాన్నే గడగడలాడించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హిట్ మోస్ట్ వాంటెడ్ టార్గెట్ గా మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు @ గణపతి పేరు గూర్చి చర్చించుకునే ముందు అసలు ఆ పేరు కు ఎందుకు అంత విలువ , ఆయన ఆ పేరు పెట్టుకోవడం వెనుక కారణాలేంటో ? ఓసారి చూద్దాం…
సంప్రదాయ కుటుంబ చరిత్ర కల్గిన భారతదేశం లో ప్రస్తుతం కొత్త పేర్లు కొంత ఆశ్చర్యపరుస్తున్నాయేమో , నాటి తరాల నుంచీ మొన్న మొన్నటివరకూ తాతలు, తండ్రుల పేర్లను, లేదా, ఏదైనా దైవం పేరు వచ్చేలా పిల్లలకు పేర్లు పెట్టడం ఓ ఆనవాయితీగా వస్తోంది.
ఓ మావోయిస్ట్ అగ్రనేత పేరు వెనుక ఎలాంటి కసరత్తు జరిగింది…గణపతి పేరుకు భిన్నంగా కనిపించే ఆ అగ్రనేత.. మరి ఆ పేరే ఎందుకు పెట్టుకున్నట్టో ఓసారి చర్చించుకుందాం.
👉 గణపతి పేరును.. ….
గణేష్ , విఘ్నేష్ , లక్ష్మీగణేష్ ఇలా రకరకాల పేర్లతో తమ పిల్లలకు పెట్టుకోవడం చూస్తుంటాం. అలాగే కొందరు గణపతి అని కూడా పెట్టుకునేవారున్నారు. అందులో ఒకరు మావోయిస్టు చీఫ్ ఉద్యమ శిఖరం గణపతి కూడా ఒకరు. మరి గణపతి మీద భక్తితో మావోయిస్టు చీఫ్ లక్ష్మణరావు తన పేరును గణపతి అని పెట్టుకున్నారా..?

వామపక్ష భావజాలమున్న వాళ్లు ఆల్ మోస్ట్ నాస్తికత్వం లేదా.. హేతువాదుల్లానే కనిపిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ఒక్క కుదుపు కుదిపిన మావోయిస్ట్ ఉద్యమంలో తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమనే కాన్సెప్ట్ తో బరిలోకి దిగి గిరిగీసి కొట్లాడిన మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావ్, అలియాస్ గణపతి.. తన పేరులో ఆది దేవుడైన గణనాథుడి పేరు వచ్చేలా పెట్టుకోవడం వెనుక కారణమేంటి..?
మావోయిస్టులు, పీపుల్స్ వార్, జనశక్తి నక్సలైట్స్ వంటి అంశాల గురించి ఎన్నో వార్తా కథనాలు ఇప్పటివరకూ జనబాహూళ్యంలో కనిపించినా… గణపతి వంటి అగ్ర మావోయిస్ట్ నేత పేరు వెనుక మర్మమేంటన్న కోణంలో మాత్రం ఎక్కడా ఆ అన్వేషణ కనిపించదు.
👉 గణపతి పేరు తల్లిదండ్రులు పెట్టింది కాదు !
జగిత్యాల జిల్లా అటవీ బీర్పూర్ నుంచి ఉద్యమమే ఊపిరిగా ఉద్యమ శిఖరంలో ఎదిగాడు గణపతి. ఉన్న ఊరును, ఉన్నత ఉద్యోగాన్ని, కుటుంబ సభ్యులను, భార్యా పిల్లలను విలాసవంతమైన జీవితాన్ని ఇలా అందరినీ కాదనుకున్న త్యాగనిరతి గణపతి అంటే..
రాజ్యంలో కనిపిస్తున్న బూర్జువా, పెట్టుబడిదారీ, నియంతృత్వ, దొరల పెత్తనం పై గాండ్రించి వామపక్ష భావజాలానికి ఆకర్షితుడై తుపాకీగొట్టం ద్వారానే బడుగు, బలహీనవర్గాల సంక్షేమం సాధ్యమనే కాంక్షతో దట్టమైన అరణ్యంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు. గణపతి అంటే.
అలాంటి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి అనే పేరు తల్లిదండ్రులు పెట్టిందేమీ కాకపోవడమే ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం. ఆ వినాయకుడిపైన భక్తితోనో… ఆ ఆదిదేవుడిపై ఉన్న విశ్వాసంతోనో ముప్పాల లక్ష్మణ్ రావు, @ గణపతిగా రూపాంతరం చెందాడనుకుంటే సరైన కారణాన్ని అన్వేషించిన హేతువాదులు కానట్టే .
👉 గణపతి పేరు వెనుక మర్మమేంటి. అంటే !
ముప్పాల లక్ష్మణ్ రావు @ గణపతి పేరు వెనుక మర్మమేంటన్నది తెలుసుకోవాలంటే మరో ఐదు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. అదీ శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతానికి వెళ్లి.. అక్కడి ఓ నక్సలైట్ నాయకుడి చరిత్రను ఓసారి పరిశీలించాలి.
పలాస మండలం బొడ్డపాడులో లో జన్మించిన తామాడ గణపతి గురించి తెలుసుకోవాలి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడి వంటి ఆధ్యాత్మికవేత్తల చరిత్రలపై మక్కువ పెంచుకున్న తామాడ గణపతి.. అగ్రవర్ణంలో పుట్టినా.. నిమ్నవర్గాల శ్రేయస్సుకై పరితపించాడు.

గణపతి కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజర్‌గా మారి 1954లో బొడ్డపాడు యువజన సంఘం బ్యానర్‌లో కృష్ణమూర్తితో పాటు యువకులను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి గ్రామంలో యువతను చైతన్యవంతం చేశారు.
ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఆ ప్రాంత ప్రజల మనస్సు చూరగొన్నాడు. నాడు ప్రజాకోర్టులు నిర్వహించి.. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిని శిక్షించడం సర్వసాధారణంగా కొనసాగుతున్న రోజులవి.
ఆ సమయంలో ప్రజాకోర్ట్ ఆదేశానుసారం ప్రజాశత్రువుగా భావించిన కామేశుణ్ని తన దళంతో వెళ్లి హతమార్చాడు తామాడ గణపతి. నాటి బూర్జూవాల పాలనతో అతలాకుతలమవుతున్న సోంపేట తాలూకా విముక్తి పోరాటానికి నాయకత్వం వహించిన తామాడ గణపతి..
తన సహచరుడు చాగంటి భాస్కర్ రావుతో కలిసి శత్రువుల చేత చిక్కాడు. ఆ తర్వాత 1969, సెప్టెంబర్ 22 న పోలీసులు తామాడ గణపతిని కాల్చిచంపిన ఎన్ కౌంటర్ ఘటనలో తామాడ అసువులు బాసాడు.
అలా నాటి తామాడ గణపతి ప్రభావానికి గురైన వ్యక్తే జగిత్యాల జిల్లా బీర్పూర్ కు చెందిన ముప్పాల లక్ష్మణ్ రావు,@ గణపతి.. నేటి మావోయిస్టు అగ్రనేత. తపాలాపూర్ ఘటనలో కూడా గణపతి పేరు అప్పటికి ‘ రాధాకృష్ణ’ గానే ఉండేది.
కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో 1976 సెప్టెంబర్ లో ఆదిలాబాద్ జిల్లాలోని తపాలాపూర్ కు చెందిన ఓ భూస్వామిని, అతని కుమారులను హతమార్చిన సంఘటనలో మొత్తం 16 మందిపై ప్రస్తుతం జన్నారంలో ఉన్న నాటి కలమడుగు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
A 1గా కొండపల్లి సీతారామయ్య, A 2 డాక్టర్ చిరంజీవితో పాటు మరో 14 మందిలో ముప్పాల లక్ష్మణరావు, అలియాస్ గణపతిపై A 8 గా రాధాకృష్ణ పేరుతో ఎఫ్ఐఆర్ నమోదై.. లక్షేటిపేట్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లులోనూ లక్ష్మణరావు అలియాస్ రాధాకృష్ణ అలియాస్ మల్లన్నగా పేర్కొనడం గమనార్హం.
కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడిగా, హుస్నాబాద్ ఏరియా దళ నాయకుడిగా కొనసాగిన సమయం నుంచి మొదలుకుంటే.. 1992లో వార్ రాష్ట్ర కార్యదర్శిగా గణపతి పేరు రోజురోజకూ ప్రాచుర్యాన్ని పొందింది. నేటికీ ముప్పాల లక్ష్మణ్ రావ్ @ గణపతి అనే ఓ బీర్పూర్ వాసి పేరు వింటే యావత్ దేశం వెంట్రుకలు నిక్కబొడ్చుకోవాల్సిందే.
👉 నక్సలైట్ ఉద్యమాన్ని కుటుంబంగా !
మన బీర్పూర్ ముప్పాల లక్ష్మణరావు @ గణపతి గా పేరు ను ఎందుకు పెట్టుకున్నాడు అని ప్రభుత్వానికి లొంగి జనజీవన స్రవంతిలో కలసిన కీలక నక్సలైట్ కొండపల్లి సీతారామయ్య, ముప్పాల లక్ష్మణరావు సహచరుడిని సంప్రదించాను..
👉 ఆశ్చర్యం ఏముంది !
లక్ష్మణరావు గారు, నక్సలైట్ ఉద్యమాన్ని , ఉద్యమకారులను, తన కుటుంబంగా , కుటుంబ సభ్యులుగా వారిని భావిస్తారు, వారి పై ప్రేమతో, లేదా వారి త్యాగాలకు స్ఫూర్తిగా ఆ పేరు పెట్టుకొని ఉండవచ్చు అని ఆయన స్పష్టం చేశారు.
(తమ బంధువుల ఇంటిలో జరిగిన శుభకార్యానికి ధర్మపురి మండలానికి వచ్చిన నాయకుడిని కలిసిన సందర్భంలో గణపతి పేరు గూర్చి చర్చకు వచ్చింది )
