👉 పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జలకాంతం వ్యాఖ్యల పట్ల జగిత్యాల జర్నలిస్టుల నిరసన!
J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం మీడియాపై అసభ్యకరమైన, అనుచితమైన భాషను ఉపయోగించి పాత్రికేయులను అవమానించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన పాల్గొనే ప్రెస్ మీట్ లు, కార్యక్రమాల కవరేజ్‌ను బహిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్లా శాఖ మరియు జగిత్యాల ప్రెస్ క్లబ్ లు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు యూనియన్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణాచారి, జగిత్యాల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్ లు తెలిపారు.
👉 జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు పాత్రికేయులు గజ్జలకాంతం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉండి, రాజ్యాంగాన్ని తామే తయారు చేశామని, జై బాపు, జై సంవిదాన్ అనేదే మా లక్ష్యం అంటూ, రాజ్యాంగాలను ప్రదర్శించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు, బాధ్యత కలిగిన వ్యక్తి ఇలాంటి పరుష పదజాలం, దూషణ మీడియాపై చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు.
👉 భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 (1) (ఏ) భావ ప్రకటన హక్కును ప్రతి పౌరుడికి కల్పించిందని, అయితే భావ ప్రకటన హక్కు కలిగి ఉన్నామంటూ, ఇతరుల భావ ప్రకటన హక్కులకు, మర్యాదకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యాన్యాలు చేయరాదంటూ ఇదే ఆర్టికల్‌లోని 5వ సబ్ క్లాజ్ తెలియజేస్తుందన్న విషయాన్ని గజ్జెల కాంతం విస్మరించడం సరికాదన్నారు.
👉 జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ, వ్యక్తిత్వాలను హననం చేసేలా వ్యాఖ్యానాలు చేసిన గజ్జెల కాంతం కార్యక్రమాలను, మీడియా సమావేశాలను జగిత్యాల జిల్లా పరిధిలో బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
👉 జగిత్యాల జిల్లా యూనియన్ మరియు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు జగిత్యాల డిసీసీ అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు.
👉 ఇటీవల బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు, రాజకీయ నేతలు సైతం మీడియాను కించపరిచేలా మాట్లాడుతున్నారని భవిష్యత్తులో ఇది పునరావృతం అయితే జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం వారి కార్యక్రమాలను బహిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
👉 ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన సీనియర్ జర్నలిస్టులు కొత్తూరు మహేష్ కుమార్, ముక్క వేణుగోపాల్, గోపి కృష్ణారావు, మదన్మోహన్, జహీరుద్దీన్, హరికృష్ణ, సిరిసిల్ల వేణు, బండ స్వామి, ప్రదీప్, హనుమంతు పటేల్, రాజు రెడ్డి, మహేష్, నరేష్, శ్రీధర్ రావు, రంజిత్, హరీష్, శమ్ము, శ్రీకాంత్, సాబీర్ తదితరులు పాల్గొన్నారు.
