నాన్న అని పిలిచే అవకాశం రాలేదు గణపతి కొడుకు ఆవేదన !

👉 మావోయిస్టు అగ్ర నేత ముప్పాళ లక్ష్మణరావు@ గణపతి కుమారుడి వాయిస్ మెసేజ్  భావోద్వేగ సందేశం !


👉 తండ్రి కోసం జీవితాంతం ఎదురుచూపులు… గణపతికి కుమారుడి హృదయవేదన !


👉 మీరు గుర్తొస్తే హృదయం ఎర్రబడుతుంది నాన్న… !


👉 నాన్న అని పిలిచే రోజుకోసం ఎదురు చూశాను…!


👉 గణపతికి కుమారుడి ఆవేదన వాయిస్ మెసేజ్ వైరల్ !


👉 గణపతికి కుమారుడి సందేశం వెనుక మానవీయ కథ…

J.SURENDER KUMAR,

మావోయిస్టు ఉద్యమంలో అగ్ర నాయకుడిగా ఎదిగిన ముప్పాళ లక్ష్మణరావు @ గణపతి కు ఆయన కుమారుడు పంపినట్లు ప్రచారంలోకి వచ్చిన ఓ వాయిస్ సందేశం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. తండ్రి కోసం జీవితాంతం ఎదురుచూసిన కొడుకు మనసులో దాగి ఉన్న బాధ, తల్లి అనుభవించిన త్యాగాలు, కుటుంబం ఎదుర్కొన్న ఎడబాటు ఈ సందేశంలో హృదయాన్ని తాకేలా వ్యక్తమయ్యాయి.

👉 హృదయాలను కలచి వేస్తుంది..

“తండ్రి ప్రేమను తెలిసినవారి మాటలు ఒకలా ఉంటాయి… తండ్రి ప్రేమ తెలియని వారి మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నా వంటి వాడి భావాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం” అంటూ ప్రారంభమైన ఈ సందేశం ఒక కుమారుడి అంతర్మథనాన్ని తెలియజేస్తోంది.

👉 చిన్ననాటి నుంచి…

చిన్ననాటి నుంచి తండ్రిని చూడాలని, తన కష్టసుఖాలను పంచుకోవాలని ఎన్నోసార్లు ఆశపడ్డానని, కానీ ఆ అవకాశం జీవితంలో ఎప్పుడూ రాలేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

👉 మొదటిసారి నాన్న అనే పిలుపు..

తనకు ఊహ తెలిసిన తర్వాత తొలిసారి “నాన్న” అని సంబోధిస్తూ మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు. తండ్రి గుర్తొస్తే తన హృదయం భావోద్వేగంతో నిండిపోతుందని, కలిసి ఉంటే “నాన్న” అని లక్షలసార్లు పిలిచేవాడినేమోనని భావోద్వేగంగా చెప్పాడు.

👉 నాయకుడిగా ఎదగడం సాధారణ కాదు !

తన తండ్రి సాధించిన స్థాయిని కూడా అతడు గుర్తుచేసుకున్నాడు. ఓ మారుమూల గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి తన శక్తితో పలు రాష్ట్రాల్లో ప్రభావాన్ని విస్తరించి ఒక పెద్ద ఉద్యమ నాయకుడిగా ఎదగడం సాధారణ విషయం కాదని పేర్కొన్నాడు. అటువంటి ప్రయాణం వెనుక ఎంత కఠోర శ్రమ, త్యాగం, పోరాటం దాగి ఉంటాయో తాను అర్థం చేసుకుంటున్నానని తెలిపాడు.

👉 అమ్మకు వందనం..

ఈ సందేశంలో ఎక్కువగా కనిపించిన అంశం మాత్రం తల్లి గురించి. తండ్రి అజ్ఞాత జీవితం ఎంచుకున్న తర్వాత తన తల్లి ఎన్నో కష్టాలు అనుభవించిందని, సమాజాన్ని ఎదుర్కోలేక ఇంటి గడప దాటలేని పరిస్థితులు ఎదుర్కొన్నదని పేర్కొన్నాడు.

తన బాధను దాచుకుంటూ తనను పెంచిందని, తనకు తండ్రి లేని లోటు తెలియకుండా చూసుకుందని కృతజ్ఞతగా చెప్పాడు. “అమ్మకు వందనం” అంటూ ఆమె త్యాగాలను గుర్తు చేసుకున్నాడు.

👉 నాన్న మీ నిర్ణయాన్ని ప్రశ్నించడం లేదు !

తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని తాను ప్రశ్నించడం లేదని కూడా స్పష్టం చేశాడు. ఆ మార్గం ఎన్నో త్యాగాలు, కష్టనష్టాలు, వీరమరణాలతో నిండి ఉందని అంగీకరించాడు.

👉 నాన్న కాలం మారింది..

కాలం మారిందని, నేటి సమాజంలో యువతకు అవగాహన పెరిగిందని పేర్కొన్నాడు. సమాజంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అనుభవజ్ఞులైన నాయకుల విజ్ఞానం యువతకు మార్గదర్శకంగా మారితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని తన ఆశయాన్ని వెల్లడించాడు.

👉 నాన్న మీకు చెప్పే స్థాయి కాదు !

“మీకు చెప్పగలిగే స్థానం నాకు లేకపోవచ్చు… కానీ ఇది నా అభిలాష” అంటూ తన భావోద్వేగ సందేశాన్ని ముగించాడు.
ఈ వాయిస్ సందేశం నిజంగా గణపతి కుమారుడిదేనా అనే విషయంపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు.
అయితే తండ్రి కోసం ఎదురు చూసిన ఒక కుమారుడి హృదయవేదనగా వినిపిస్తున్న ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.