ప్రముఖ ఆర్థికవేత్త తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తో భారత ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక  సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు సుబ్రమణియన్  ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.


👉  అసెంబ్లీలోని ముఖ్యమంత్రి  ఛాంబర్‌లో సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

👉 విద్యుత్ రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ విభాగాల్లో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచనా, తదితర అంశాలపై సుబ్రమణియన్ తో చర్చించారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకుని ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు.

👉 డాక్టర్ నందిని సిధారెడ్డికి సీఎం అభినందనలు!

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ 2025 పురస్కారం లభించడం పట్ల, సిధారెడ్డికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  శుభాభినందనలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన కవి నందిని సిధారెడ్డి గారు రాసిన “అనిమేష” కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.

👉 సిధారెడ్డి  కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను చిత్రీకరించడంవల్ల తనకు సమాజంపట్ల ఉన్న నిబద్ధతను, అలాగే తనలోనున్న ఆర్ద్రతను తెలియజేస్తుందని, వారు గొప్ప మానవతావాదని అన్నారు. సిధారెడ్డి  సుదీర్ఘ సాహిత్య కృషికి లభించిన గౌరవమని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజల్లో చైతన్యం నింపడంలో వారు పోషించిన పాత్ర చిరస్మరణీయమని ముఖ్యమంత్రి  ఈ సందర్భంగా పేర్కొన్నారు.

👉 ఆధునిక తెలుగు కవిత్వంలో నందిని సిధారెడ్డి  ఎన్నో పరిశోధనాత్మక రచనలతో సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించారని, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గౌరవంగా ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. సాహితీ రంగంలో సిధారెడ్డి గారు మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

👉 సీఎంను కలిసిన తిలక్ వర్మ !

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని టీమ్ ఇండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. T20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు వాకిటి శ్రీహరి , మహమ్మద్ అజారుద్దీన్ , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి , తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.