ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు ఎవరికి అన్యాయం జరగదు !

👉 మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని !

👉 మూసీ నది పునరుజ్జీవం ఫేజ్ -1 పై ప్రభుత్వం  ఏర్పాటు చేసిన సదస్సులో !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

మన భవిష్యత్తు తరాల కోసం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చాలా స్పష్టంగా చెప్పారు. “ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏ పేదవాడికి అన్యాయం జరగదు. ఎవరి ఆస్తులను గుంజుకోవడం లేదు. మన అందరి భవిష్యత్తు కోసం చేపట్టిన ప్రాజెక్టు. హైదరాబాద్‌ను గొప్ప అభివృద్ది చెందిన నగరంగా నిలబెట్టాలన్న ఆశయం. అందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ముందుకు వెళ్లడానికి సూచనలు ఇవ్వండి”. అని ముఖ్యమంత్రి  కోరారు. 


👉 మూసీ నది పునరుజ్జీవం ఫేజ్ -1 పై ప్రభుత్వం మూసీ ఇన్వైట్స్ పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి  ప్రసంగించారు. మూసీ చారిత్రక పరిణామాలు, ప్రాజెక్టు లక్ష్యాలు, దాని ఆవశ్యకతను వివరిస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, నిపుణులు, నిష్ణాతులు, పౌరులు తమ సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


👉 శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ..


👉 “ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ అన్యాయం జరగదు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంపై సలహాలు సూచనలు ఇవ్వండి. మూసీ ప్రతిపాదిత ప్రాజెక్టు వెంట మొత్తంగా 10 వేల పేద కుటుంబాలున్నాయి. ఇప్పటికే డేటా సేకరించాం. వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేశాం.


👉 అయితే, దూరప్రాంతాలకు వెళ్లడం వల్ల చిన్న చిన్న పనులు చేసుకునే వారు ఉపాధి కోల్పోతామని అంటున్నారు. అందుకని సమీప ప్రాంతాల్లోనే ఇండ్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికీ నష్టం చేయం. వారితో నాకు శత్రుత్వం ఏముంటుంది. పేదల్లో దుఃఖాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. నా ఆలోచనలన్నీ పేదల వెంటే ఉన్నాయి.


👉 ఏ పేదవాడికి అన్యాయం చేయం. ఏ పేదవాడిని నిరాశ్రయులుగా చేయబోం. పేదలకు నష్టం కలిగించడానికి, కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక ప్రయోజనాల కోసమో పనిచేయడం లేదు. ఈ రాష్ట్రాన్ని, నగరాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా నిలబెట్టాలని అనుకుంటోంది. ఇందులో మనమంతా భాగస్వాములం.


👉 చరిత్రను ఒకసారి గమనిస్తే, నది పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత విలసిల్లింది. నదులు, సముద్రం, నీటి ప్రవాహాలు ఉన్న ప్రాంతాలే అధికంగా అభివృద్ధి చెందాయి. థేమ్స్, హడ్సన్ నదులు, సింగపూర్, సియోల్, దుబాయ్, అహ్మదాబాద్ సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు… ఎన్నింటినో గమనించిన తర్వాత తెలంగాణ కూడా ఆర్థిక ప్రగతిని సాధించాలని, అభివృద్ధి నిరోధకులుగా ఉంటే భావి తరాలు క్షమించవని మూసీ రివర్ ఫ్రంట్ కార్యక్రమాన్ని చేపట్టాం. 


👉 1908లో మూసీకి ఉప్పెన వచ్చి వేలాది మంది మరణించిన సందర్భంలో ఆనాటి నిజాం వరద నివారణ, జంట నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి వందేళ్ల కిందట ఒక గొప్ప విజన్‌తో ఉస్మాన్‌సాగర్, నిజాంసాగర్‌లను నిర్మించిన చరిత్రను విస్మరించరాదు.


👉 ఎంతో దూరదృష్టితో వందేళ్ల కిందట గొప్ప గొప్ప ప్రాజెక్టులు, వారసత్వ సంపదను సృష్టించి మేటి నగరంగా అందించారు. అలాంటి నగరాన్ని ఇలాగే వదిలేద్దామా. ప్రపంచంలో వస్తున్న మార్పులు, పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకు వెళదామా. మన రాజకీయ అవకాశాల కోసం చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా.


👉 రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేయొద్దు. ప్రాజెక్టుకు సహకరించకపోయినా పర్లేదు. కానీ అడ్డురాకండి. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుపై శాసనసభలో కూడా చర్చకు పెడతాం. అందరూ తమ అభిప్రాయాలు చెప్పాలి. అందరి సలహాలు స్వీకరిస్తాం. ప్రాజెక్టు కోసం ఎంతో కసరత్తు చేశాం. గ్లోబల్ టెండర్లు పిలిచి కన్సల్టెంట్లను నియమించాం.


👉 హైదరాబాద్ నగర జనాభా 1.34 కోట్లుంటే, మరో 25 ఏళ్లలో 2.5 కోట్లకు చేరనుంది. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు భావి తరాలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దా.


👉 మూసీ వెంట నివాసం ఏర్పాటు చేసుకున్న వారి గురించి సానుభూతితో మాట్లాడుతున్నాం. మూసీ కిందనున్న నల్గొండ ప్రజల గురించి కూడా ఆలోచన చేయాలి. విపరీతమైన వ్యర్థాలు, పారిశ్రామిక కాలుష్యం, కళేబరాలతో కాలకూట విషంతో నల్గొండ ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. 


👉 మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై కొందరు ఉద్దేశపూర్వకంగా, కొందరు సంపూర్ణ సమాచారం లేకపోవడం వల్ల ఒక రకమైన ఆందోళన తలెత్తింది. ప్రజలు ఒక బాధ్యతతో, విశ్వాసంతో నమ్మి అధికారం అప్పగించినప్పుడు, కాపలాదారుడిగా ఉంటాం.
మా ఆలోచన ఎవరికో నష్టం కలిగించాలని కాదు. ఎవరైనా కావాలని, కోరుకుని మూసీ వెంట జీవించాలని అనుకుంటారా. నిలువ నీడ లేని వాళ్లే మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్నారు.


👉 ఈ ప్రాజెక్టు గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మూసీకి అటో కి.మీ, ఇటో కి.మీ కూల్చేస్తాడని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ ప్రాజెక్టులో మానవీయ కోణాన్ని ఎక్కడా విస్మరించలేదు. మూసీ వెంట దుర్భరమైన  జీవితాన్ని గడుపుతున్న పేదవారితో చెలగామాడకండి.


👉 గాంధీ విగ్రహం కోసం ₹ 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం దాదాపు ₹75 కోట్లకు మించి ఖర్చు చేయడం లేదు. మొత్తం ప్రాజెక్టు₹ 6500 నుంచి ₹7 వేల కోట్లకు మించి లేదు.


👉 ఏఐ వంటి సాంకేతిక విప్లవాన్ని ఎలాగూ ఆపలేం. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నప్పుడు, బ్లూ కాలర్ ఉద్యోగాలు సృష్టించొద్దా. మూసీ ఒక పర్యటక కేంద్రంగా, నైట్ ఎకానమీగా, ఆర్థిక అభివృద్ది కోసం చేయొద్దా.


👉 నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. మనం చేసిన మంచి, చెడు ఇక్కడే ఉంటాయి. భగవంతుడు నాకిచ్చిన అవకాశానికి సార్థకత చేకూరాలని కోరుకుంటున్నా. ప్రకృతికన్నా మనం గొప్పవాళ్లం కాదు.


👉 ఇది కోట్లాది మంది నగర ప్రజల భవిష్యత్తు. దీన్ని కాపాడుకుందామా. కాలానికి వదిలేద్దామా. ఏం కావాలో సలహాలు ఇవ్వండి. వెబ్‌సైట్‌లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మంచిని తప్పకుండా స్వీకరిస్తాం. కుట్ర సిద్దాంతానికి ముగింపు పలకండి. నేను మీలో ఒకడిని. అందరం కలిసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్దాం. ప్రపంచంతో పోటీపడే విధంగా హైదరాబాద్ ను ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకుందాం…” అని ముఖ్యమంత్రి  భావోద్వేగంతో చెప్పారు.


👉 తొలుత ఈ సమావేశంలో మూసీ నది పూర్వోత్తరాలు, ప్రస్తుత స్థితిగతులు, నగర ప్రజల భవితవ్యం, నది పునరుజ్జీవం ఆవశ్యకత, ఆవసరం, ప్రపంచ వ్యాప్తంగా రివర్‌ఫ్రంట్‌ల ప్రాముఖ్యత, మూసీ రివర్‌ఫ్రంట్‌లోని ప్రధాన అంశాలతో పాటు River Musi Rejuvenation Phase-1 సమగ్ర స్వరూపాన్ని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.