👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
హైదరాబాద్ నగరంలో రోడ్లను విస్తరించుకుందాం. చెరువులను పునరుద్ధరించుకుందాం. నాలాల ఆక్రమణలను తొలగించుకుందాం. పిల్లలకు క్రీడా మైదానాలు కట్టుకుందాం. అభివృద్ధి చెందుతున్న ఒక మంచి నగరంగా అభివృద్ధి చేసుకుందాం..” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
👉 కూకట్‌పల్లిలో హైడ్రా HYDRAA పునరుద్ధరించిన నల్లచెరువును ముఖ్యమంత్రి ప్రారంభించారు. చెరువులో గంగమ్మతల్లికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
👉 “దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం. అయితే, ఆక్రమణలు తొలగించి, కాలుష్యం నివారించి మూసీ నదిని పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు.
👉 హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, హైడ్రా పనులు ప్రారంభించినప్పుడు చాలా మంది నాపై విమర్శలు చేశారు. ఇందులో నాకెలాంటి దురుద్దేశం లేదు. నల్లచెరువును పునరుద్ధరించిన తర్వాత వేలాది మంది మొహాల్లో ఆనందం చూసినప్పుడు సంతోషం కలిగింది.
👉 పునరుద్ధరించిన చెరువు పార్కుల చుట్టూ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేద్దాం. స్టాల్స్ పెట్టాలి. పిల్లలు ఆడుకోవడానికి స్థలాల్లేవు. చెరువుల ఒడ్డున ఆటస్థలాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరించుకుందాం.

👉 ఇలాంటి పనులు చేసుకునప్పుడు నిజంగానే కొందరికి నష్టం కలిగి ఉండొచ్చు. పేదవారు ఎవరికీ అన్యాయం చేయను. అలాంటి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను సిద్ధం చేశాం. నిజంగా నష్టం జరిగిన వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుందాం.
👉 నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేద్దాం.
👉 అహ్మదాబాద్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగానది రివర్ ఫ్రంట్ నిర్మించుకుని ఆ నగరాలను అభివృద్ధి చేసుకున్నప్పుడు మనమెందుకు మూసీని ప్రక్షాళన చేయకూడదు” అని ప్రశ్నించారు.
👉 ఈ కార్యక్రమంలో సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి , పీఏసీ చైర్మన్ ఆరికెపూడి గాంధీ , ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు , రామచంద్రు నాయక్ , ఎమ్మెల్సీ నవీన్ రావు తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
