👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించడానికి సంబంధించి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
👉 శాసనమండలి సమావేశ హాలులో ముఖ్యమంత్రి తో ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా నిఖిల్ డే ప్రశంసించారు.
👉 తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించారు. అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
👉 రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న “జన్ సూచన పోర్టల్” తరహాలో తెలంగాణలోనూ ‘ప్రజా సూచన పోర్టల్ ‘ ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది.
👉 వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా ఈ పోర్టల్ రూపొందించనున్నారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
👉 తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్‌ను ఈ సందర్భంగా నిఖిల్ డే ప్రశంసించారు. ఈ చట్టం దేశంలోనే చారిత్రాత్మకంగా నిలుస్తుందని అన్నారు.
👉 ఈ సమావేశంలో తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
