👉 హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కృత్రిమ మేధస్సు పై సదస్సులో .!
👉 వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
మానవజాతి గొప్ప ఆవిష్కరణల్లో ఒకటైన కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – AI) రెండు వైపులా పదునైన కత్తిలాంటిదని, అప్రమత్తంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా బోస్టన్ సిటీలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్, కృత్రిమ మేధస్సు (AI) పై సదస్సులో ముఖ్యమంత్రి వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఈ AI సింపోజియంలో మాట్లాడే తొలి భారతీయుడిగా ఉండటం గర్వకారణంగా భావిస్తున్నానని చెప్పారు.
👉 ఏఐ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ తీసుకుంటున్న చర్యలను సింపోజియంలో వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ..
👉 “ఇప్పుడు ప్రపంచమంతా ఏఐ గురించి ఆలోచిస్తోంది. OpenAI ChatGPT ని ప్రారంభించిన తర్వాత Gemini, Claude, Grok, Deepseek, Perplexity, Copilot వంటి ఎల్ఎల్ఎంలు (Large Language Models) అందరి దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఇది భవిష్యత్తులో మరింత శక్తివంతంగా, మెరుగ్గా విస్తరిస్తుంది.
👉 కొత్త కొత్త సాంకేతికత వచ్చినప్పుడు భయం సహజంగానే కలుగుతుంది. గతంలో నూతన సాంకేతికత వచ్చినప్పుడు భయాలు కలిగాయి. ఇప్పటివరకు ఏ టెక్నాలజీకి తనకు తానుగా సొంత నిర్ణయ సామర్థ్యం లేదు. AI కు స్వతంత్ర నిర్ణయ సామర్థ్యం ఉండటమే భయాలకు కారణం.
👉 పారిశ్రమ విప్లవం రాకతో యంత్రాల ముందు మనిషి శారీరక సామర్థ్యం తగ్గిపోయింది. ఇప్పుడు AI తో, మనిషి ఆలోచనా సామర్థ్యానికి కూడా సవాలు ఎదురవుతోంది. ఇది అనేక ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది. యంత్రాల రాకతో ఉద్యోగాలు పూర్తిగా పోలేదు. కాకపోతే పనులు తేలికయ్యాయి.
👉 AI కూడా డాక్టర్లు, న్యాయవాదులు, ఆర్కిటెక్టులు, రచయితలు వంటి వారి పనిలో మార్పు తీసుకువస్తుందే తప్ప పూర్తిగా వారిని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. కాకపోతే, ఏఐ వల్ల ప్రాథమిక స్థాయి ఉద్యోగాల సంఖ్య తగ్గవచ్చు. అదే సమయంలో కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుంది.

👉 ఏఐ విషయంలో నా వంటి నాయకులకు తలెత్తే ప్రశ్న ఏమిటంటే – మేం ఏం చేయాలి? హైదరాబాద్ ఒక నాలెడ్జ్ సెంటర్. ఫార్మా, సాఫ్ట్ వేర్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, మ్యానుఫాక్చరింగ్, ఏరో స్పేస్, డిఫెన్స్, రిటైల్ రంగాలకు గ్లోబల్ సంస్థల కేంద్రం. వైట్ కాలర్ జాబ్‌ల సక్సెస్‌పైనే హైదరాబాద్ ఆధారపడి ఉంది.
👉 AI ఉద్యోగాలను తగ్గిస్తే, అందరూ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సవాళ్లను అధిగమించాలన్న ఆలోచనతో “భారత్ ఫ్యూచర్ సిటీ” అనే కొత్త నగరాన్ని నిర్మిస్తున్నాను. అందులో ఒక భాగాన్ని AI సిటీగా అభివృద్ధి చేస్తున్నాం.
👉 AI సంస్థలకు ఒకే చోట అన్ని సౌకర్యాలు కలిగించే కేంద్రంగా ఉంటుంది. నగరానికి బయట గ్రీన్ ఎనర్జీతో పనిచేసే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. మనుషుల నైపుణ్యాలను ఉపయోగించి AI అభివృద్ధికి ప్రపంచానికి కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీని మారుస్తాం.
👉 ఏఐ మార్చలేని గ్లోబల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన పెంచుతున్నాం. గ్రీన్ ఎనర్జీ ఆధారంగా తయారీ రంగాన్ని అభివృద్ధి చేసి “చైనా+1” కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది మా లక్ష్యం.
👉 ఉద్యోగాలు కోల్పోయే వారికి పునఃశిక్షణ (reskilling) అందించేందుకు హార్వర్డ్ వంటి ప్రపంచ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం చేసుకుంటున్నాం. కాలుష్యానికి కార్బన్ క్రెడిట్స్ ఉన్నట్లే, AI కంపెనీలకు “పీపుల్ క్రెడిట్స్” విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నాం.
👉 తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అందరినీ నేను ఆహ్వానిస్తున్నా. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రా రంగాల్లో పెట్టుబడులకు హైదరాబాద్‌లో అవకాశం ఉంది. హైదరాబాద్ ఇప్పటికే Fortune 500 కంపెనీలకు కేంద్రంగా ఉంది. మరిన్ని సంస్థలు త్వరలో రానున్నాయి.
👉 AI అభివృద్ధికి తోడ్పడిన మహనీయులందరికీ వందనాలు. వాళ్లు మన జీవితాలను మార్చివేశారు. ఏఐ అందరికీ మంచి చేస్తుందని భావిద్ధాం. ఈ సింపోజియం AI ని నైతికంగా, బాధ్యతతో వినియోగించే మార్గాలను చూపుతుందని ఆశిస్తున్నా…” అని ముఖ్యమంత్రి ముగించారు.
