సాదా బైనామా భూములకు పరిష్కారం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.

👉 తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు.


👉 శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు. ఈ నెల 22న రైతు భరోసా అందించబోతున్నామని తెలియజేస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


👉 రైతు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటిస్తూ.. “ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్న సందర్భంగా రైతులకు అండగా దాన్ని తరిమేసి భూ భారతితో రైతాంగ సమస్యలను పరిష్కరిస్తున్నాం. సాదా బైనామాకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నాం.


👉 సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని గట్టెక్కించడానికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు బోనస్ కూడా ఇచ్చి ఆదుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల మేరకు దేశంలో అతితక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం గర్వకారణం


👉 పరిశ్రమలు ఎన్ని వచ్చినా, ఐటీ రంగాలు ఎంతగా రాణించినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రధాన జీవనాధారం వ్యవసాయమే.  రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు ₹ 20,616 కోట్ల మేరకు రుణమాఫీ చేసి రైతులను ఆత్మగౌరవంతో బతకడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది.


👉 ప్రతి ఎకరాకు ₹ 12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం ₹18 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద అందించింది.


👉 పండించిన పంటలపై రైతుల్లో విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రుణమాఫీ చేయడం, రైతుభరోసా అందించడంతో పాటు రైతు బీమా అమలు చేయడం వంటివన్నీ రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు.


👉 ప్రభుత్వం రైతుల కోసం ప్రయత్నాలు, నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలన్నీ దేశంలో తెలంగాణ ప్రతిష్టను పెంపొదిస్తాయి. మన పొలాల్లో సమృద్ధిగా పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో విలసిల్లుతుంది..” అని అన్నారు.


👉 ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు , కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


👉 ఈ వేడుక సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి  పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన అర్చకులను ముఖ్యమంత్రి  సత్కరించారు.