సాంస్కృతిక వేడుకలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

👉 శాసనసభ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ….

J.SURENDER KUMAR ,

శాసనసభ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

👉 క్రీడలు, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి తో పాటు మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

👉 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన ప్రదర్శనలను తలకించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “నిరంతరం ప్రజా సమస్యలతో క్షణం తీరిక లేకుండా ఉండే ప్రజాప్రతినిధులు క్రీడలు, వారు ప్రదర్శించిన కళలు రాష్ట్రంలోని లక్షలాది విద్యార్థినీ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయి.

👉 చాలా మంది తమ విద్యార్థి దశలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, వృత్తి జీవితంలో స్థిరపడిన తర్వాత తమలోని కళను, నైపుణ్యాలను మరిచిపోతున్నారు.

👉 ఈ మధ్యకాలంలో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే విద్యార్థులు కొందరు వ్యసనాలకు బానిసలవుతున్నారు. విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలన్న ఉద్దేశంతోనే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహించాం.

👉 చదువులో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మైదానాల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుంది.

👉 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సంప్రదాయం కనుమరుగైంది. శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్  విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమాలను పునరుద్ధరించాం.

👉 ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలి” అని కోరారు. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు క్రీడలు, సాంస్కృతిక శాఖలను ముఖ్యమంత్రి  అభినందించారు.

👉 ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మంత్రి వాకిటి శ్రీహరి , ప్రజాప్రతినిధులు కేఆర్ నాగరాజ్ , జాటోత్ రామచంద్ర నాయక్ , ఆది నారాయణ , శంకర్ నాయక్ , వెడ్మ బొజ్జు , తెల్లం వెంకట్రావు , రాందాస్ మాలోత్ , మందల సామెల్  వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. వారిని ముఖ్యమంత్రి  ప్రత్యేకంగా అభినందించారు.

👉 రెండు రోజుల పాటు నిర్వహించిన స్పోర్ట్స్, కల్చరల్ మీట్‌లో విజేతలకు ముఖ్యమంత్రి  చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రాణించిన ముఖ్యమంత్రి  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు.