సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం !

👉 మృతులు ఒక్కరికి  ₹ 5 లక్షల చొప్పున 44 మృతుల కుటుంబ సభ్యులకు !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

సౌదీ అరేబియా మదీనా సమీపంలో బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా పరిహారం అందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  వారికి చెక్కులను అందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అందుకే అందర్నీ సచివాలయానికి పిలిచి పరిహారం అందించామని చెప్పారు.

👉 ఈ ప్ర‌భుత్వం మీది. ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవసరం లేదని, అండ‌గా ఉంటామని ముఖ్య‌మంత్రి   బాధిత కుటుంబాల‌కు భ‌రోసా ఇచ్చారు. ప్ర‌మాదం జరిగినట్లు తెలుసుకున్న వెంట‌నే మంత్రి అజ‌హ‌రుద్దీన్  నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందాన్ని మ‌దీనాకు పంపామ‌ని గుర్తుచేశారు.

చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌క్ష‌ణ‌మే పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి మ‌దీనా పంపించామ‌న్నారు. అక్క‌డి భార‌త్ కాన్సులేట్‌, సౌదీ ప్ర‌భుత్వంతో చ‌ర్చించి మృతిచెందిన వారి అంత్య‌క్రియ‌లు జ‌న్నుతుల్ బ‌ఖీలో చేయించిన విషయాలను గుర్తుచేశారు.

👉 నవంబర్ 17, 2025 న మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవదహనమైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు ₹ 5 లక్షలు చొప్పున, గాయపడిన ఒకరి కుటుంబానికి ₹ 3 లక్షల పరిహారం అందించారు.

👉 దేశం బ‌య‌ట జ‌రిగే ప్ర‌మాదాల్లో మృతిచెందిన వారికి ప్ర‌భుత్వాలు ప‌రిహారం చెల్లించే విధానం లేనప్పటికీ, ప్రభుత్వం మాన‌వ‌తా దృక్ప‌థంతో స‌హాయం అందించాలని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ముఖ్యమంత్రి  చెప్పారు. ఇటీవ‌ల నాంప‌ల్లి అగ్నిప్ర‌మాదంలో మృతిచెందిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లించామ‌న్నారు.

👉 ముస్లిం సోద‌రుల‌తో త‌నకున్న‌ అనుబంధాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్బంగా గుర్తు చేసుకున్నారు. తాను కొడంగ‌ల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన 2009 సంవ‌త్స‌రం నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని అయిదు మండ‌లాల నుంచి ఒకొక్క‌రి చొప్పున ఏటా అయిదుగురిని త‌న సొంత ఖ‌ర్చుల‌తో హ‌జ్ యాత్ర‌కు పంపుతున్నాన‌ని చెప్పారు. వారిని ఎంపిక చేసే బాధ్య‌త స్థానిక ముస్లిం మ‌త పెద్ద‌ల‌కే అప్ప‌జెప్పాన‌న్నారు.

👉 కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ , ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , మహమ్మద్ షబ్బీర్ అలీ, నాంప‌ల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్‌ , హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్ ఖుస్రో పాషా , తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ  వైస్ ఛైర్మ‌న్ ఫహీం ఖురేషి , రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మ‌న్ ఒబేదుల్లా కొత్వాల్  పాల్గొన్నారు.