తెలంగాణ  భవిష్యత్తు పట్ల మా సంకల్పం తెలిపాం!


👉 శాసనసభ వేదికగా గవర్నర్  ప్రసంగం ద్వారా వివరించాం !

👉 శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!

J.SURENDER KUMAR,

“తెలంగాణ సమగ్రాభివృద్ధి, ప్రజల భవిష్యత్తు పట్ల మా సంకల్పం ఏమిటన్నది శాసనసభ వేదికగా గవర్నర్  ప్రసంగం ద్వారా వివరించాం. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఒక స్పష్టమైన విధానంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం..” అని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు.

👉 శాసనసభ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా  ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి  సవివరంగా సమాధానమిచ్చారు.

👉 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి రూపొందించిన విశిష్ట ప్రణాళికను శాసనసభ వేదికగా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పిన గవర్నర్ కు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

👉 శాసనసభ సంప్రదాయాన్ని కాపాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో ప్రతిపక్షం కలిసొస్తుందని ఆశించానని, రాష్ట్రానికి కొత్తగా వచ్చిన గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తే, అభినందించడానికి ప్రతిపక్ష నేత సభకు వస్తారని ఆశించానన్నారు.

👉 ఏఐ వల్ల భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదురుకాబోతున్నాయి, పెద్ద సునామీ రాబోతోందన్న చర్చ జరుగుతోంది. ఆ సవాళ్లను ఎదుర్కొనడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోకపోతే జాతి మనల్ని క్షమించదు.

👉 దేశానికి స్వాతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి సాధించాల్సిన లక్ష్యాలతో కేంద్రం వికసిత్ భారత్ ప్రణాళికలు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం క్యూర్, ప్యూర్, రేర్ ప్రణాళికలతో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించింది.

👉 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. రాష్ట్రంలో యువతీ యువకులకు, మహిళలు, రైతులకు భరోసా, ఆ వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రణాళికలు రూపొందించాం.

👉 ఆ మేరకు కోర్ అర్బన్ రీజియన్‌లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను తరలించాలని నిర్ణయించాం. అద్భుతమైన వారసత్వం సంపదతో ఒకనాడు రాక్ సిటీ, లేక్ సిటీగా విలసిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తేవాలన్న లక్ష్యంలో భాగంగా మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళికలు చేశాం.

👉 దేశంలోని కాలుష్యంతో ఢిల్లీ, వరదలతో ముంబై, చెన్నై, ట్రాఫిక్ ఇతర సమస్యలతో బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాలు ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించిన తర్వాతైనా, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అంచనా వేసుకుని ముందుకు వెళ్లకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవు. 

👉 జీవించడానికి కూడా వీలులేకుండా భవిష్యత్తులో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కోర్ అర్బన్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ గా మార్చి, ఇక్కడి రెడ్, ఆరెండ్ కేటగిరీ పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించాం.

👉 కాలుష్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంతోనే ఈవీ వాహనాలపై ట్యాక్స్ రద్దు చేశాం. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ చార్జీలను రద్దు చేయడం వల్ల 2025-26 లో ప్రభుత్వం ₹791 కోట్ల ఆదాయం కోల్పోయింది. అయినా కాలుష్యం నియంత్రించాలన్న లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నాం.

👉 కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ ముందుకు రానప్పుడు ప్రభుత్వమే దాన్ని టేకోవర్ చేసి విస్తరణ ప్రాజెక్టులను చేపడుతుంది.

👉 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రోడ్డుతో పాటు రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం అనుమించింది. ఔటర్ రింగ్ రోడ్డు – రీజినల్ రింగ్ రోడ్డు మధ్య భాగాన్ని మాన్యుఫాక్చరింగ్ ప్రాంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుగుణంగా తీర్చిదిద్దుతాం.

👉 శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మారబోతోంది. శంషాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై, బెంగళూరు, పూణె నగరాలకు బుల్లెట్ ట్రెయిన్స్ ప్రాజెక్టులను కేంద్రం నుంచి సాధించుకున్నాం. అలాగే మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించబోతున్నాం.

👉 రీజినల్ రింగ్ రోడ్డు అవతలి భాగం నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనతో రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు చేశాం. 1.10 లక్షల చ.కి.మీ మేరకు రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీని వృద్ధి చేయడానికి ప్రాంతాల వారిగా పంటలను, ముఖ్యంగా రైతులకు మరింత లాభదాయకంగా పంటల మార్పిడి విధానాలు, ఆర్గానిక్ ఫుడ్ ను ప్రోత్సహించే లక్ష్యాలను నిర్ధేశించాం. పంటల

👉 ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లడంలో భాగంగా వివిధ పాలసీలను తీసుకొచ్చాం. ఇందిరా మహిళా శక్తి పాలసీ, టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, లైఫ్ సైన్సెస్ పాలసీ, క్రీడా విధానం తీసుకొచ్చాం. 

👉 పర్యావరణం కాపాడి, పరిశుద్ధమైన నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కాలుష్య కారక పరిశ్రమలను తరలించడానికి తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై ప్రతిపక్ష నాయకులు కోరితే ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ ఏజెన్సీ, సంస్థతోనైనా విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉంది.

👉 అలాగే టీడీఆర్‌ల విషయంలో కూడా తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జారీ అయిన వాటిపై ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే సమగ్ర విచారణ చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

👉 తెలంగాణ యువకుల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకున్నాం. 67,763 ఉద్యోగాలను భర్తీ చేశాం. మరో 13,197 ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది.

👉 ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. ఇప్పటివరకు ఈ పథకం కింద మహిళలు ₹ 9,700 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు. 22 ఇందిరా మహిళా శక్తి జిల్లా కేంద్రాలను నిర్మించుకోబోతున్నాం

👉 నిరుపేదల వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ₹2,300 కోట్లు ఖర్చు పెట్టాం. సీఎంఆర్ఎఫ్ కింద ₹2,046 కోట్లు ఖర్చుచేశాం. ఆడబిడ్డలకు ₹ 500 సబ్సిడీ కింద సిలిండర్ అందించడానికి ₹ 752.22 కోట్లు వెచ్చించాం. గృహ జ్యోతి పథకం కింద 52 లక్షల కుటుంబాలకు ₹397 కోట్లు ఖర్చు పెట్టాం. రాష్ట్రంలోని 39 వేల ప్రభుత్వ స్కూల్స్, విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాం.

👉 రైతు రుణమాఫీ కోసం ₹ 20,616 కోట్లు, రైతు భరోసా కింద 18 వేల కోట్లు, సన్నవడ్లకు బోనస్గా ఇప్పటివరకు ₹1940 కోట్లు చెల్లించాం. ఇవి ప్రభుత్వ గ్యారెంటీలు.

👉 ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు, పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తు తరాల కోసం తెలంగాణ విజన్ 2047 దార్శనిక పత్రం రూపొందించాం. స్వాతంత్య్రానంతరం తొలి ప్రధాని నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, పీవీ నరసింహరావు  దూరదృష్టితో ప్రణాళికబద్ధంగా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న కారణంగానే ప్రపంచంలో ఒక పటిష్టమైన దేశంగా భారత్ నిలబడగలిగింది.

👉 నేను కష్టజీవిని. తెలవంది నేర్చుకుంటా. నేర్చుకున్నది పది మందికి చెబుతా. తట్టపని మట్టిపని చేసి కష్టపడి పైకొచ్చినవాడిని. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి కష్టపడుతా. మా ప్రభుత్వం మొదటి విడతగా 1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి మా మంత్రివర్గం బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తుంది.” అని ముఖ్యమంత్రి చెప్పారు.