తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం సీఎం రేవంత్ రెడ్డి !

👉 ” తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు -2026″

👉 అసెంబ్లీలో  బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

J.SURENDER KUMAR ,

ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న సంకల్పంతోనే ప్రభుత్వం తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చెప్పారు. శాసనసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు -2026” పై ముఖ్యమంత్రి  మాట్లాడారు.

👉 “వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు భద్రత కల్పించాలని అందుకు అనుగుణంగా చట్టం చేయాలని ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో ఆలోచన చేసి దీన్ని తీసుకొచ్చాం. తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టం తెచ్చాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఈ చట్టం ఒక కీలక ముందడుగు.


👉 మనిషి బంధాలు, అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి, భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయే పరిస్థితులు వచ్చాయి. తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిది కాదని అన్నారు.


👉 “దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రాజ్యాంగ రక్షణతో పాటు, అనేక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ఏ) ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య హక్కు ఉంది. ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బాల కార్మికుల నిషేధం ఉంది.


👉 అనాథలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కుకున్న పిల్లల సంరక్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ (2015) ఉంది. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం పోక్సో చట్టం (2012) ఉంది. విద్యా హక్కు చట్టం (2009) ఉంది. 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోకూడదని బాల కార్మిక చట్టం ఉంది. బాల్య వివాహాల నిషేధం చట్టం ఉంది.


👉 పిల్లల హక్కులు, రక్షణ విషయంలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి. మహిళల విషయానికి వస్తే, గృహ హింస నుంచి వాళ్లకు భద్రత కల్పించడం కోసం చట్టం ఉంది. లైంగిక నేరాలకు సంబంధించి నిర్భయ లాంటి చట్టాలున్నాయి. వరకట్న నిషేధ చట్టం ఉంది. మహిళల గౌరవం – హక్కుల పరిరక్షణకు చట్టం ఉంది.


👉 ఇక వృద్ధుల సామాజిక భద్రతకు సంబంధించి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. పిల్లలు తమ తల్లి దండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ “maintenance and welfare of parents and senior citizens act 2007” ఉంది.


👉 ఇలా చాలా చట్టాలు ఉన్నప్పటికీ సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో జరుగుతున్న వివక్ష, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సంఘటనలు అందరం చూస్తున్నాం. బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్న సందర్భం అత్యంత దురదృష్టకరమని” అన్నారు.


👉 పురాణాలలో మాతృ పితృ భక్తికి మారుపేరుగా నిలిచిన శ్రవణ కుమారుడి కథను సభలో వివరించారు. తల్లిదండ్రులను ప్రేమించడంలో అందరూ శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే వారి బాగోగుల గురించి ఎలాంటి చట్టాలు, నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉండదన్నారు.


👉 ప్రఖ్యాత దుస్తుల వ్యాపారి రేమండ్స్ మాజీ అధినేత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్ పథ్ సింఘానియా దృష్టాంతాన్ని కూడా సభలో ప్రస్తావించారు. వేలకోట్లు ఆర్జించిన గొప్ప వ్యాపారవేత్త విజయ్ పథ్ సింఘానియా ఆస్తి సర్వస్వాన్ని కుమారుడికి గిఫ్ట్ డీడ్ రూపంలో అప్పగించిన తర్వాత ఆయన జీవితం ఏ విధంగా విషాదకరంగా మారిన సంఘటనను వివరించారు.


👉 ఆస్తి దక్కగానే కుమారుడు తండ్రి సొంత ఇంటిని కూడా దక్కనీయకుండా బయటకు పంపడంతో అద్దె ఇంట్లో నివసించాల్సిన దయనీయ పరిస్థితులను వివరిస్తూ, జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను విజయ్ పథ్ సింఘానియా రాసుకున్న ఆత్మకథ ‘An Incomplete Life’ లో “పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశాను, ఏ తండ్రీ నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదు”  అని ఆ పుస్తకంలో వ్యక్తం చేసిన ఆవేదన సమాజంలోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తుందని ముఖ్యమంత్రి  సభకు తెలియజేశారు.


👉 “ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. లేదా ఎక్కువ మంది సంతానం ఉండేది. దాని వల్ల ఒకరు కాకపోయినా ఇంకొకరైనా తల్లిదండ్రుల సంరక్షణ చూసేవాళ్లు. కుటుంబ నియంత్రణతో ఒక్కరిద్దరికే పరిమితమయ్యారు.


👉 నాకు తెలిసిన ఒక ప్రజా ప్రతినిధి తండ్రికి క్యాన్సర్ సోకితే చికిత్స ఇప్పించకుండా నిర్లక్ష్యం వహించారు. ఇటీవలే వారు మరణించారు. తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలి. ఒక సామాజిక బాధ్యతగా ఈ బిల్లును తీసుకువస్తున్నాం. పిల్లల్లో జవాబుదారితనం రావాలి.


👉 ఈ చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు. ఈ చట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే మా ప్రయత్నం. ఏ తల్లి దండ్రులు అనాథలుగా మిగిలిపోవద్దు. చివరి రోజుల్లో వాళ్ల బాగోగుల కోసం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెచ్చాం.


👉 ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే కాదు. ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలో చేర్చాం. ఈ చట్టం చేయడం ద్వారా కొంతైనా వృద్ధ తల్లిదండ్రుల్లో విశ్వాసం కల్పించిన వారంగా మారుతాం. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని, ఒక సామాజిక బాధ్యతతో తెసుకొచ్చిన ఈ బిల్లుకు అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాలి” అని ముఖ్యమంత్రి  సభకు విజ్ఞప్తి చేశారు.