విద్య వైద్య రంగాలను చాలెంజ్ గా తీసుకున్నాం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

తెలంగాణలో 1 కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా, ఆరోగ్య భద్రత అందించాలని ఆలోచన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  తెలిపారు. “విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలను నూతన చాలెంజ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. పేదలకు సరైన విద్య, వైద్యాన్ని అందించినప్పుడు దాదాపు 90 శాతం సమస్యలను పరిష్కరించగలిగినట్టే. అందుకే జీవిత బీమా, ఆరోగ్య భద్రత అందించాలనుకుంటున్నాం” అని చెప్పారు.


👉 హైదరాబాద్ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ తో కలిసి గురువారం ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ,

మహిళలు అత్యధికంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నందున రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాలకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించాం.


👉 గడిచిన రెండేళ్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ (CMRF) కింద ₹1800 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు పెట్టాం. ఉస్మానియా, వరంగల్ టిమ్స్, అల్వాల్ టిమ్స్, ఎల్బీనగర్ టిమ్స్, సనత్ నగర్ టిమ్స్, నిమ్స్.. ఆసుపత్రుల్లో దాదాపు ₹10 వేల కోట్లు ఖర్చు చేసి 10 వేల పడకల ఆసుపత్రులను నిర్మిస్తున్నాం.


👉 విద్య ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు చేరినప్పటికీ నాణ్యమైన విద్య అందడం లేదు. యాంత్రికంగా సాగుతున్న విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టాం. నైపుణ్యత మెరుగుపర్చుకోకుంటే, ప్రపంచంతో పోటీ పడలేం. అందుకే విద్యా విధానంలో సంస్కరణలు చేపట్టాం. ఒక పాలసీ తీసుకొచ్చాం. విద్యతో పాటు స్కిల్స్ అవసరం.


👉 నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించాలని కొత్త కాన్సెప్ట్‌తో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానం తీసుకొస్తున్నాం. ఇప్పటివరకు 10 వ తరగతి తర్వాత ఇంటర్ విధానం కొనసాగుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12 వ తరగతి పాఠశాల విద్య కింద తీసుకొస్తున్నాం.


👉 విద్యార్థులకు పాఠశాలల్లో ఉదయం నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించాం. కార్పొరేట్ స్కూల్స్ తరహాలోనే విద్యార్థులకు ఉచితంగా లేదా 50 శాతం ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్ అర్బన్ రీజియన్‌లో నూతన విధానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం.


👉 ఏఐ రావడం వల్ల టెక్నాలజీ రంగంలో వైట్ కాలర్ జాబ్స్‌కు ప్రత్యామ్నాయంగా మారొచ్చునేమో, కానీ బ్లూ కాలర్ జాబ్స్‌ని ఏఐ రిప్లేస్ చేయలేదు. స్కిల్స్ లేని కారణంగా ప్రతి ఏటా రాష్ట్రం నుంచి 1.10 లక్షల ఇంజనీరింగ్ గ్యాడ్యుయేట్లు ప్రపంచంతో పోటీ పడలేని పరిస్థితి.

👉 అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించాం. టాటా కన్సల్టెన్సీ సహకారంతో పురాతన ఐటీఐలను ఏటీసీ సెంటర్లుగా మార్చాం. తర్వాత దశలో పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఈ విధానంలోకి తెస్తాం.


👉 కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యులు సామాజిక బాధ్యత కింద సంవత్సరంలో నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సేవలు అందించాలి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక వేదిక సృష్టించబోతోందని, విదేశాల్లో ఉన్న మన వైద్యులతో పాటు ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు కూడా ముందుకు రావాలి.

👉 వైద్యం యాంత్రికంగా చేసే వృత్తి కాదు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి మానవత్వంతో కూడిన వైద్య సహాయాన్ని అందించినప్పుడే రోగులకు వారి కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఆసుపత్రుల్లో వైద్యులు వ్యవహరించే తీరు, నిర్వహించే విధానమే రోగుల సగం సమస్యలను పరిష్కరిస్తుంది.


👉 దేశంలో 25వ మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషం. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ హాస్పిటల్ మరింతగా రాణించాలి” అని ముఖ్యమంత్రి  అభిలషించారు.


👉 ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు కుందూరు జైయవీర్ రెడ్డ, నవీన్ యాదవ్, మెడికవర్ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్  శరత్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ  హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో పాటు పలువురు ప్రముఖులు వైద్యులు పాల్గొన్నారు.