ఏ ఐ ముప్పు గూర్చి ఆలోచన చేయాలి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

ఒక సునామీలా ముంచుకొస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ముప్పును ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోతే దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రమాదంవైపు నెట్టబడుతుందని, ప్రత్యామ్నాయంగా బ్లూ కాలర్ ఉద్యోగాలకు అనుగుణంగా వాతావరణాన్ని మార్చుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.  

👉 విద్యావేత్త, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఇబ్రహింపట్నంలో స్థాపించిన AVN Lakefield Global School ను ముఖ్యమంత్రి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని వివరించారు.

👉 ఏఐ సునామీలో దేశం ఎదుర్కోబోయే సమస్య ఎంత తీవ్రమైందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

👉 “ప్రతి గ్రామంలోనూ విద్య అందుబాటులో ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఎక్కడ విఫలమయ్యామో ప్రజా ప్రతినిధులు అందరూ ఆలోచన చేయాలి. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాలి. వ్యవస్థను ఎంపవర్ చేయాల్సిన అవసరముంది.

👉 తెలంగాణ ప్రభుత్వం విద్యపైన ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తిని చూపుతోంది. అందులో భాగంగానే వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను, ఒక్కో పాఠశాలలో 2500 విద్యార్థులు చదువుకునేలా నిర్మాణాలు ప్రారంభించాం. ఇప్పటికే 59 స్కూల్స్ పనులు ప్రారంభించాం.



👉 మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ఒకటో తరగతి పుస్తకాన్ని చదవలేని పరిస్థితి. 6వ తరగతిలో ఉన్న విద్యార్థి 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు. విద్యలో నాణ్యత తగ్గుతోంది. ఈ పరిస్థితి దేశ భవిష్యత్తుకే అత్యంత ప్రమాదకరం.

👉 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ₹1 లక్షా 8 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. బడ్జెట్లో 8.3 శాతం నిధులు విద్యపైన ఖర్చు పెడుతున్నాం. ప్రైవేటు విద్యా సంస్థల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విధానం లేదు.
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులుంటే, 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం విఫలం చెందడం వల్లే ప్రైవేటు వైపు వెళుతున్నారు.

👉 అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా వంద ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి విధానం తీసుకొస్తున్నాం. 1.34 కోట్ల జనాభా కలిగిన హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో పాఠశాలలను రేషనలైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నాం.

👉 ప్రైవేటు పాఠశాలలు సక్సెస్ కావడానికి నర్సరీ, ఎల్ కేజీ వంటి విధానంతో పాటు రవాణా సౌకర్యం కూడా ఒక కారణం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి తోడు బ్రేక్ ఫాస్ట్, లంచ్, అది కూడా మంచి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించాం.

👉 విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. క్రీడల్లో రాణించిన వారిని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 2034 లో ఒలింపిక్స్ భారతదేశంలో నిర్వహించాలని ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం… అని పేర్కొన్నారు.

👉 ఈ కార్యక్రమంలో శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ గారు, వేం నరేందర్ రెడ్డి , రఘునందన్ రావు , చామ‌ల కిర‌ణ్ రెడ్డి తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.