👉 అమలుకు నోచుకోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశాలు !
J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రం ధర్మపురి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రతి రోజూ వందల సంఖ్యలో కస్టమర్లు ( వినియోగదారులు ) వస్తుంటారు. వీరిలో చాలా మంది సమీప గ్రామీణ ప్రాంతా నుండి వచ్చే సాధారణ అమాయక ప్రజలు. వారికి బ్యాంకింగ్ ప్రక్రియలపై పూర్తి అవగాహన ఉండదు. అయినా తమ అవసరాల కోసం రాక తప్పని పరిస్థితి, బ్యాంకు సిబ్బంది సహకరించక పోతారా ? అనే ఆశతో బ్యాంక్‌కి వస్తారు. కానీ ఇక్కడ ఎదురయ్యే పరిస్థితులతో వినియోగదారులు విలవిలలాడుతు, తీవ్ర అసౌకర్యానికి, అసహనానికి గురి అవుతున్నారు.
👉 దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కోట్లాది ప్రజలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర ఎంతో గొప్పది. అయితే, చాలా బ్రాంచ్‌లలో కస్టమర్ అనుభవం మాత్రం ఆశించిన లేదనేది వాస్తవం. వినియోగదారుల చేదు అనుభవాలకు ధర్మపురి బ్రాంచ్ ఉదాహరణగా నిలుస్తోంది .
👉 బ్యాంకులో చిన్న పని కోసం కస్టమర్ లు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఫారమ్‌లు ( డెబిట్, క్రెడిట్ ) నింపడం చాలా మంది వినియోగదారులకు కష్టంగా మారుతోంది. సహాయం అడిగితే, దానికి స్పందన ఉండదు. ఇది గ్రామీణ బ్యాంకు వినియోగదారులకు మరింత ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోంది.

👉 డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సులభతరం కావాల్సిన సమయంలో YONO యాప్ సరిగా పనిచేయకపోవడం మరో పెద్ద సమస్య. సర్వర్ సమస్యలు, లాగిన్ ఇబ్బందులు, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్లు వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. దీనివల్ల కస్టమర్లు మళ్లీ బ్రాంచ్‌కు రావాల్సి వస్తోంది.
👉 మరొక సమస్య , సిబ్బంది కొరత. ఇది కూడా సిబ్బంది తగిన సేవలు అందించలేకపోవడంలో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తక్కువ మంది సిబ్బంది, ఎక్కువ పని — ఈ అసమతౌల్యం సేవల నాణ్యత పై ప్రభావం చూపుతోంది. ఈ బ్రాంచ్ లో, చాలా మంది వినియోగదారులకు సేవలలో లోపం కన్నా కొంతమంది సిబ్బంది ప్రవర్తన ఎక్కువ బాధపెడుతోంది.
👉 పలుమార్లు వినియోగదారులతో చికాకుతో, నిర్లక్షంగా, గౌరవం లేకుండా మాట్లాడుతున్న సంఘటనలు అనేకం. బ్యాంక్‌కు వచ్చే వినియోగదారులు సేవ కోసం వస్తారు, కానీ అవమానం ఎదుర్కొనే పరిస్థితి చాలా మందికి అనుభవమే. బ్యాంకింగ్ సేవలు అందుకోవడం వినియోగదారులకు ఒక హక్కుగా కాక సిబ్బంది వీరిపై చూపుతున్న జాలిగామారిన దయనీయ స్థితి నెలకొంది.
👉 దీనికి తోడు బ్రాంచ్ లో కనీస మౌలిక సౌకర్యాల కొరత కూడా గమనించదగ్గ విషయం. తాగునీరు, వాష్ రూమ్, సరైన విధంగా అందుబాటులో లేకపోవడం, పార్కింగ్ సదుపాయం లేకపోవడం, ఎయిర్ కండిషనింగ్ పనిచేయకపోవడం వంటి సమస్యలు వినియోగదారులకు మరింత అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. గంటల తరబడి వేచి ఉండే వారికి ఇవి అవసరమైన కనీస సౌకర్యాలు.
ఈపరిస్థితి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది — ప్రజలకు సేవ చేయాల్సిన బ్యాంకులు , నిజంగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటున్నాయా? బ్యాంకింగ్ సేవలు కేవలం లావాదేవీలకే పరిమితం కాకుండా, వినియోగదారులకు గౌరవం, సహాయం, సౌకర్యం అందించడంలోనూ ప్రతిబింబించాలి కనీసం లావాదేవీలైనా సమయంలో అందించాలి
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) వినియోగదారుల సేవల గురించి ఏ మార్గదర్శకాలు ఇచ్చింది ? అవి ఇక్కడ అమలవుతున్నాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
ప్రతి లావాదేవీలకు ఒక నిర్దిష్ట సమయం ఇవ్వబడింది. ప్రతి బ్రాంచ్‌లో “May I Help You” కౌంటర్ ఉండాలి. అది నామమాత్రపు కౌంటర్ కారాదు. బ్యాంక్‌లోకి వచ్చిన ప్రతి వినియోగదారుడికి సేవలు అందించాలి. ఇలాంటి అనేక ఆదేశాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ల రూపంలో బ్యాంకులను ఆదేశిస్తుంది.
ధర్మపురి బ్రాంచ్ లో పరిస్థితి చూస్తే…..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు అమలు అవుతున్నట్లు కనిపించడం లేదు. అంతేకాదు, వీటి గురించి సిబ్బందికి అవగాహన ఉన్నదా ? అనేది అనుమానమే .
👉 అమలుకు నోచుకోని మహాత్మా గాంధీ చెప్పిన మాటలు !

@వినియోగదారులు మన వద్దకు వచ్చే అత్యంత ముఖ్యమైన వ్యక్తి.
@ అతను మనపై ఆధారపడిలేడు.
మనమే అతనిపై ఆధారపడి ఉన్నాము.
@ అతను మన పనికి అంతరాయం కాదు; మన పని అసలు ఉద్దేశ్యo అతడే.
@ అతను మన వ్యాపారానికి బయటివాడు కాదు.అతడు దానిలో ఒక భాగం.
@ అతనికి సేవ చేయడం ద్వారా మనం అతనికి ఉపకారం చేయడం కాదు;
@ మనకు సేవ చేసే అవకాశం ఇచ్చి, అతడే మనకు ఉపకారం చేస్తున్నాడు.”
ఈ వాక్యాలు కేవలం బ్రాంచ్ మేనేజర్ కేబిన్ లో ఒక ఫ్రేమ్ కు పరిమితం అవకూడదు. వీటి సారాన్ని ప్రతి ఉద్యోగి జీర్ణించుకోవాలి. అంతేకాక ప్రతి వినియోగదారుడిని కృతజ్ఞతతో చూడాలి.
“బ్యాంకుల బలం వినియోగదారుల విశ్వాసం… ఆ విశ్వాసాన్ని కాపాడటం ప్రతి బ్యాంక్ ఉద్యోగి బాధ్యత.” గుర్తించి ధర్మపురి ఎస్బిఐ బ్రాంచ్ లో వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చేయను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
