గిరిజన జీవితాల్లో వెలుగులే మా ప్రభుత్వ సంకల్పం !

👉 గిరిజన ప్రాంత సమస్యలపై మానవతా దృక్పథంతో పనిచేయండి !.

👉 మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్, అధికారులకు దిశ నిర్దేశం !

J.SURENDER KUMAR,

గిరిజన జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే మా ప్రజా ప్రభుత్వ సంకల్పమని, ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

హైదరాబాద్ లోడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో బుధవారం గిరిజన ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, అటవీ శాఖ అధికారులు, గిరిజన ప్రాంతాల ప్రజాప్రతినిధుల తో  మంత్రి లక్ష్మణ్ కుమార్ విస్తృతంగా చర్చించారు.


👉 గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం పేద గిరిజనులు నివసించే ప్రతి ప్రాంతానికి చేరుకునే త్రోవ (రోడ్డు), నివసించేందుకు గూడు (ఇల్లు), అడవుల్లో చీకట్లు తొలగించే విద్యుత్ సౌకర్యం( కరెంటు), తాగునీటి కోసం బోర్లు వంటి ప్రాథమిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.


👉 ఈ మౌలిక సదుపాయాలే గిరిజనుల జీవన ప్రమాణాల పెరుగుదలకు పునాది అని పేర్కొన్నారు, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, అమలు దశలో ఎదురవుతున్న అడ్డంకులపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.


👉 గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలంటే శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, కేటాయించిన నిధులు లక్ష్యానికి చేరేలా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నిధులు ఉన్నా పనులు జరగకపోవడం సహించబోమని హెచ్చరించారు.


👉 అటవీ భూములు, పోడు సాగు, ఫారెస్ట్ రైట్స్ చట్టం కింద హక్కుల పత్రాల జారీ విషయంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేసి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వేగంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


👉 అటవిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనలు వారికి కేవలం వ్యవసాయం ఒక్కటే ఆధారం కాబట్టి అటవీ చట్టం అనుసరించి వారికి ఎక్కడ వీలు అయితే అక్కడ వారికి వ్యవసాయం చేసుకునేలా సాగు భూమిని అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి అటవీశాఖ అధికారులను ఆదేశించారు.


👉 గిరిజన యువతను ప్రభావితం చేస్తున్న కుల ధ్రువీకరణ సమస్యలపై మంత్రి ప్రత్యేక చొరవ చూపారు. హైకోర్టు అడ్వకేట్ జనరల్‌తో సంప్రదించి ఎస్టీ సర్టిఫికెట్ వ్యవహారంలో శాశ్వత పరిష్కారం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ధ్రువీకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరళమైన విధానాన్ని అమలు చేయాలని సూచించారు.


👉 జిల్లాస్థాయిలో కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, అటవీ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.


👉 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక రవాణా సమస్యలు గిరిజనులకు అడ్డంకి కాకూడదని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైన చోట ప్రత్యేక అనుమతులు ఇచ్చి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అలాగే తాగునీటి సమస్య నివారణకు కొత్త బోర్లు త్రవ్వడం, పాత వనరులను పునరుద్ధరించడం చేపట్టాలని ఆదేశించారు.


👉 గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించారు. గిరిజన గ్రామాలను స్వయంగా సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటానని తెలిపారు.


👉 ఈ నెలాఖరులోగా గిరిజన ప్రాంతాల్లో ముఖ్య సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు ప్రారంభించాలని మంత్రి గడువు విధించారు. ఒక ప్రాంత సమస్యను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేయకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.


👉 ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, గిరిజన సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించినందుకు మంత్రిని ప్రత్యేకంగా  అభినందించారు.

ఈ సమావేశంలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ  , ఎమ్మెల్యేలు బాలు నాయక్, రామచంద్ర నాయక్, డా. చిక్కుడు వంశీకృష్ణ, మురళి నాయక్, కోవ లక్ష్మి, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, డిఎఫ్ఓలు ఇతర  ఉన్నత అధికారులు పాల్గొన్నారు.