కాళేశ్వ‌రం లోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చెయ్యాలి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాల‌ని ముఖ్య‌మంత్రి . రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (NDSA) సూచ‌న‌ల మేర‌కు వీలైనంత త్వ‌ర‌గా ఈ ప‌నుల‌ను వేగవంతం చేయాల‌ని చెప్పారు.


👉 కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌త్తుల కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించి నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.


👉 మరమ్మత్తులకు సంబంధించిన ఏజెన్సీల‌న్నింటిని అప్ర‌మ‌త్తం చేసి ప‌నుల్లో వేగం పెంచాల‌ని సూచించారు. సెంట్ర‌ల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ స్టేష‌న్ (CWPRS) ఆధ్య‌ర్యంలో జ‌రుగుతున్న‌ ప‌రీక్ష‌లు, న‌మూనాల సేక‌ర‌ణను వ‌ర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.


👉 నీటిపారుద‌ల శాఖ, సీడ‌బ్ల్యూపీఆర్‌ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థ‌లు, డిజైన్ కన్సల్టేషన్స్‌తో టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజిని అధ్య‌య‌నం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో అధికారులు వివరించారు.


👉 మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వడానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి  చెప్పారు. అందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకుని వీలైనంత త్వ‌ర‌గా పని పూర్తి చేయాలని ఆదేశించారు.


👉 మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబరు వరకు చేయాల్సిన పనులపైన పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలన్నారు.


👉 పనుల్లో జాప్యం జరగడానికి వీలు లేదని, నిధుల విషయంలో ఇబ్బంది రానివ్వమని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభం అయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని చెప్పారు.


👉 ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.